ఐదు ప్రైవేటు కాలేజీల ఎగ్జామ్ సెంటర్లు రద్దు

ఐదు ప్రైవేటు కాలేజీల ఎగ్జామ్ సెంటర్లు రద్దు
  •     ఎగ్జామినర్లే చిట్టీల సప్లయర్లు 
  •     సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి కాపీయింగ్
  •     రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఎగ్జామినర్లపై వేటు  
  •     కార్పొరేట్ కాలేజీల్లోనే ఎక్కువ అక్రమాలు  

హైదరాబాద్, వెలుగు: ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్  పరీక్షల్లో ‘మాస్’ కాపీయింగ్ కంటిన్యూ అవుతోంది. కాపీయింగ్‌ను అరికట్టాల్సిన ఎగ్జామినర్లే దగ్గరుండి మరీ చిట్టీలు పంచుతూ స్టూడెంట్లకు సహకరిస్తున్నారు. నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆఫ్  చేసి, టెక్నికల్  సమస్యల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. బుధవారం మధ్యాహ్నం సెషన్‌లో కమాండ్  కంట్రోల్  రూం  ద్వారా సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ఇంటర్ బోర్డు అధికారులు.. జరుగుతున్న తంతు చూసి షాక్ తిన్నారు. 

దీంతో రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలు జరుగుతున్న 21 సెంటర్లను గుర్తించి, అక్కడి ఎగ్జామినర్లు, సిబ్బందిని సరెండర్  చేయడమే కాకుండా.. ఐదు ప్రైవేటు కాలేజీల సెంటర్లను పూర్తిగా రద్దుచేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీసీ కెమెరాలు బంద్  చేయడం, యథేచ్ఛగా మాస్  కాపీయింగ్ జరుగుతుండడంతో ఐదు ప్రైవేటు జూనియర్  కాలేజీల పరీక్షా కేంద్రాలను ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య రద్దు చేశారు. 

ఆయా కాలేజీల విద్యార్థులకు ఇకపై దగ్గర్లోని ప్రభుత్వ కాలేజీల్లో ప్రాక్టికల్స్  నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు. రద్దయిన పరీక్షా కేంద్రాల్లో వనపర్తి జిల్లాలోని విజ్ఞాన్  జూనియర్  కాలేజీ, జోగుళాంబ గద్వాల జిల్లాలోని విశ్వశాంతి జూనియర్  కాలేజీ, మహబూబ్ నగర్  జిల్లాలోని ప్రతిభ జూనియర్  కాలేజీ, హైదరాబాద్  జిల్లా తార్నాకలోని కెరీర్ పాయింట్  జూనియర్  కాలేజీ, రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లోని ఎస్ఆర్ జూనియర్  కాలేజీలు ఉన్నాయి. 

మాయాజాలం ఇలా..

పరీక్షా కేంద్రాల్లో జరుగుతున్న అక్రమాలను ఇంటర్  బోర్డు సీరియస్ గా పరిగణించింది. కాపీయింగ్  మొదలుపెట్టే సరిగ్గా అదే సమయానికి కొన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు ‘ఆఫ్‌లైన్’లోకి వెళ్లడం లేదా ‘బ్లింక్’ అవ్వడం గమనించారు. ఇది కావాలని చేసిన ట్యాంపరింగ్  అని అధికారులు తేల్చారు. బయటి నుంచి మెటీరియల్  లోపలికి రావడానికి వీలుగా, ఎగ్జామినర్లు కావాలనే ఎగ్జామ్  హాల్  వదిలి బయటకు వెళ్లిపోతున్నారు. 

వీటిని పరిగణనలోకి తీసుకొని 21 మంది ఎగ్జామినర్లపై చర్యలు తీసుకున్నారు. బుధవారం ఉదయం సెషన్​లో 14 మందిని తొలగించిన విషయం తెలిసిందే. అయితే, అక్రమాలకు పాల్పడే కాలేజీల్లో కార్పొరేట్  కాలేజీలే ఎక్కువగా ఉన్నాయి. 

పర్మినెంట్​గా డిబార్: ఇంటర్ బోర్డు 

అక్రమాలకు పాల్పడిన ఎగ్జామినర్లకు, అసిస్టెంట్లకు రెమ్యునరేషన్  కూడా ఇచ్చేది లేదని ఇంటర్  బోర్డు తేల్చి చెప్పింది. భవిష్యత్తులో ఇంటర్  బోర్డుకు సంబంధించిన ఏ డ్యూటీలోనూ (థియరీ లేదా ప్రాక్టికల్) పాల్గొనకుండా వారిని శాశ్వతంగా డిబార్ చేసింది. వారి స్థానంలో వెయిటింగ్  లిస్టులో ఉన్న రిజర్వ్ సిబ్బందిని నియమించాలని డీఐఈఓలను ఆదేశించింది.