సైఫాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ఆధారంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన ఐదుగురు యువకులను అరెస్ట్ చేసినట్లు సైఫాబాద్ సీఐ ఎ.సీతయ్య తెలిపారు. మార్చి 29న అర్ధరాత్రి ఒంటిగంటకు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ జంక్షన్ నుంచి సెక్రటేరియట్ వైపు వెళ్తున్న పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకులు అత్యంత నిర్లక్ష్యంగా ప్రయాణించారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తు చేపట్టారు. వడ్డీ అర్జున్(22) బైక్ నడుపుతున్నట్లు గుర్తించారు. అతనితో పాటు అరుపు రోహిత్(19), చింతకుంట అంజికుమార్(19), సిద్ధం కౌశిక్(18), వల్లపు మురళి(18) ఒకే బైక్‌పై ప్రయాణించినట్లు తేలింది.
హెల్మెట్ ధరించకుండా, బైక్ సామర్థ్యానికి మించి ఐదుగురు ప్రయాణించడంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు.
