రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. మంగళపల్లిలోని రాఘవేంద్ర హోటల్‌కు వచ్చిన కొందరు కస్టమర్లు బట్టర్ మిల్క్ ఆర్డర్ చేయగా... అందులో ఏకంగా ఈగలు ప్రత్యక్షమవడమే కాకుండా, ఆ మజ్జిగ తాగిన పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మజ్జిగ తాగిన కొద్దిసేపటికే బాధితులకు తీవ్రంగా వాంతులు కావడంతో... వారిని తక్షణమే చికిత్స నిమిత్తం స్థానిక లీమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఇక మజ్జిగలో ఈగలు ఉండటంపై బాధితులు, స్థానికులు హోటల్ యజమానిని నిలదీయగా... ఆయన అత్యంత నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా సమాధానం చెప్పడం గమనార్హం. అసలు ఈగలు ఉన్న మజ్జిగను కస్టమర్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించిన వారిపై హోటల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. అంతేకాకుండా తప్పు బయటపడటంతో కంగారుపడ్డ సిబ్బంది... క్యాన్లలో ఉన్న మిగతా మజ్జిగను వెంటనే పారబోసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు.
విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. రాఘవేంద్ర హోటల్‌ను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. హోటల్‌లో కనీస పరిశుభ్రత పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడితే ఊరుకునేది లేదని, హోటల్ లైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
