ఢిల్లీలో దట్టమైన పొగమంచు కారణంగా విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. విజిబులిటీ తగ్గిపోవడంతో విమానాల టేకాఫ్, ల్యాండింగ్ కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నిన్న అర్ధరాత్రి నుంచి 46 విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. ఢిల్లీలో దిగాల్సిన ప్రయాణికులు సమయానికి సిటీ చేరుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు ఢిల్లీ ఎయిర్ పోర్టులోనే పడిగాపులు కాస్తున్నారు. అటు ఉత్తర భారతంలో ఫాగ్ కారణంగా 17 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు రైల్వే విభాగం తెలిపింది. రాజస్థాన్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ, యూపీలో దట్టమైన పొగమంచు సమస్య ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది.
ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఫాగ్ పరేషాన్ చేస్తోంది. నోయిడాలో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. విజిబులిటీ 50 మీటర్ల కంటే తక్కువే ఉంటోంది. దీంతో వేకువ జామున పనుల కోసం వెళ్లే వాహనదారులు లైట్లు వేసుకున్నా… ఎక్కువ దూరం కనిపించడం లేదు. దీంతో వాహనదాల కదలికలు నెమ్మదిగా వెళ్లాల్సి వస్తోంది. ఢిల్లీలో నిన్న 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువ నమోదు అయింది. నిన్న 750 ఫ్లైట్లు ఆలస్యం అయ్యాయి. ఇందులో 19 విమానాలు రద్దు అయ్యాయి. 100 ట్రైన్లు ఆలస్యంగా నడిచాయి.
మరోవైపు రాజస్థాన్ లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. దట్టమైన పొగమంచుతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. శ్రీగంగానగర్, హనుమాన్ గడ్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువకు పడిపోయాయి. రాజస్థాన్ లో శ్రీగంగానగర్ అతి శీతల ప్రాంతం. ఈ సీజన్ లో తాజాగా అక్కడ 6.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. మరో రెండు మూడు రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని వాతావరణ శాఖ చెబుతోంది.
