తెగిన రోడ్లు .. కొట్టుకుపోయిన పట్టాలు

తెగిన రోడ్లు .. కొట్టుకుపోయిన పట్టాలు
  • ఏడుగురు మృతి.
  • ఆరుగురు మిస్సింగ్
  • 6,540 ఇండ్లు ధ్వంసం
  • 24 జిల్లాల్లో 2 లక్షల 
  • మందిపై ఎఫెక్ట్


గువహటి/హఫ్లాంగ్: ఎడతెరిపి లేని వర్షాలతో అస్సాం అతలాకుతలమైంది. వరదలు ముంచెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. కచర్ జిల్లాల్లో వరద ప్రమాదాల్లో ఇద్దరు, డిమా హిసావో జిల్లాలో కొండచరియలు విరిగిపడి ముగ్గురు చనిపోయారు. ఇప్పటిదాకా అస్సాంలో వర్షాలకు ఏడుగురు చనిపోయారు. కచర్ జిల్లాలో ఆరుగురు గల్లంతయ్యారు. 811 గ్రామాల్లోని 6,540 ఇండ్లు పాక్షికంగా లేదా పూర్తిగా ధ్వంసమయ్యాయి. 24 జిల్లాల్లోని 2 లక్షల మందిపై ప్రభావం పడింది.

నాలుగు జిల్లాల్లో ఎక్కువ నష్టం

హొజయ్, కచర్ జిల్లాల్లోనే 1,29,514  మందిపై వరదల ఎఫెక్ట్ పడిందని అస్సాం డిజాస్టర్ మేనేజ్‌‌మెంట్ అథారిటీ (ఏఎస్‌‌డీఎంఏ) తెలిపింది. మొత్తంగా 20 జిల్లాల్లోని 652 గ్రామాలపై ప్రభావం పడిందని చెప్పింది. కచర్, డిమా హిసావో, హొజాయ్, చరయ్‌‌డియో జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగిందని తెలిపింది. 7 జిల్లాల్లో 55 రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(ఎన్‌‌డీఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం(ఎస్‌‌డీఆర్ఎఫ్), అగ్నిమాపక దళం, ఎమర్జెన్సీ సిబ్బంది రెస్క్యూలో పాల్గొంటున్నారు. గడిచిన 24 గంటల్లో 16 చోట్ల రోడ్లు, వంతెనల కట్టలు తెగిపోయాయి. చాలా చోట్ల రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి.

డిమా హిసావో ఒంటరి..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కొండచరియలు విరిగిపడి డిమా హిసావో జిల్లాకు రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. చాలా చోట్ల ట్రాకులు కొట్టుకుపోయాయి. ట్రాక్‌‌లపై నీళ్లు నిలిచాయి. కింద మట్టి కొట్టుకుపోయి ట్రాక్ లు వేలాడుతున్నాయి. డిమా హిసావొలో లంబ్డింగ్, బదర్‌‌‌‌పూర్ మధ్య 2 ట్రైన్లలో చిక్కుకుపోయిన 2,800 మంది ప్రయాణికులను సేఫ్​గా తరలించారు. చాలా మందిని ఎయిర్‌‌‌‌ఫోర్స్ ఎయిర్‌‌‌‌లిఫ్ట్ చేసింది. న్యూ హాఫ్లాంగ్ రైల్వే స్టేషన్ వరదతో నిండిపోయింది. కొండచరియలు విరిగిపడటంతో స్టేషన్‌‌లో ఆగి ఉన్న ఖాళీ రైలు కొద్దిదూరం కొట్టుకుపోయింది.