పెద్దపల్లిలో బీఆర్​ఎస్​ ఖాళీ : వివేక్ వెంకటస్వామి

పెద్దపల్లిలో బీఆర్​ఎస్​ ఖాళీ : వివేక్ వెంకటస్వామి

కోల్ బెల్ట్, వెలుగు: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. గురువారం మందమర్రిలో పలువురు బీఆర్ఎస్ కు చెందిన లీడర్లు, కార్యకర్తలు ఎమ్మెల్యే వివేక్, నల్లాల ఓదెల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిందన్నారు. 

కాంగ్రెస్ సర్కారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై  పెద్ద సంఖ్యలో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలు అహంకారంతో కమీషన్ల కోసం పనిచేశారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కేవలం మూడు నెలల కాలమే అయిందని.. ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఇప్పటికే ఐదింటిని నెరవేర్చామన్నారు. 

ఎన్నికల కోడ్ తర్వాత మిగిలినవి అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. పెద్దపల్లి ప్రాంతంలో కాకా కుటుంబం ప్రజలకు సేవ  చేస్తోందన్నారు. ఎంపీగా గడ్డం వంశీకృష్ణను గెలిపిస్తే పెద్దపెల్లి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని చెప్పారు. కాంగ్రెస్​లో చేరిన వారిలో మందమర్రిలోని 21,22 వార్టులకు చెందిన రాచర్ల రవి కుమార్, మెండే భాస్కర్, మేకల సత్యనారాయణ, విలాసాగర్, వనిత ఉన్నారు.