13 రాష్ట్రాల్లో ప్రారంభమైన సెకండ్ ఫేజ్ పోలింగ్

13  రాష్ట్రాల్లో ప్రారంభమైన సెకండ్ ఫేజ్ పోలింగ్

న్యూఢిల్లీ:  లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా దేశంలోని 13 రాష్ట్రాలు/యూటీల్లోని 89 స్థానాలకు శుక్రవారం(ఏప్రిల్ 26న) ఉదయం 7 గంటలకు  సెకండ్ ఫేజ్ పోలింగ్ ప్రారంభం అయ్యింది.  సాయంత్రం 5 గంటల వరకూ అధికారులు ఓటింగ్ నిర్వహించనున్నారు. కేరళలోని మొత్తం 20 సీట్లకు ఎన్నికలు జరగనుండగా..కర్నాటకలో14 సీట్లు, రాజస్థాన్‌లో 13, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌లలో 8  సీట్ల చొప్పున, మధ్యప్రదేశ్‌లో 7, అస్సాం, బీహార్‌లలో 5 సీట్ల చొప్పున, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ లలో 3 సీట్ల చొప్పున, మణిపూర్, త్రిపుర, జమ్మూ అండ్ కాశ్మీర్‌లలో ఒక్కో సీటుకు పోలింగ్ జరగనుంది. ఈ 89 సీట్లల్లో మొత్తం1206 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. శుక్రవారంతో  కేరళ, రాజస్థాన్, త్రిపురలలో  ఎన్నికలు ముగుస్తాయి. 

పోటీలో ఉన్న కీలక నేతలు వీళ్లే..

సెకండ్ ఫేజ్ ఎన్నికల బరిలో కీలక నేతలు ఉన్నారు. వయనాడ్‌ నుంచి రాహుల్‌ గాంధీ పోటీలో నిలబడ్డారు. సీపీఐకి చెందిన అన్నీ రాజా, బీజేపీకి చెందిన సురేంద్రన్​తో ఆయన పోటీ పడుతున్నారు. తిరువనంతపురంలో కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌, బీజేపీ నుంచి చంద్రశేఖర్, సీపీఐ నుంచి పన్యన్ రవీంద్రన్ బరిలో ఉన్నారు. యూపీలోని మథురలో హేమ మాలిని, కాంగ్రెస్ అభ్యర్థి ముఖేశ్ ధన్‌గర్‌తో పోటీ పడుతున్నారు. రాజస్థాన్​లోని కోటా నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లా.. ఈసారి కాంగ్రెస్‌కు చెందిన ప్రహ్లాద్ గుంజాల్‌తో తలపడుతున్నారు. జోధ్‌పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్​తో కాంగ్రెస్ తరఫున కరణ్ సింగ్ ఉచియార్దా పోటీలో నిలిచారు. బెంగళూరు సౌత్ సిట్టింగ్ ఎంపీ, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వి సూర్య, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యారెడ్డితో తలపడనున్నారు. చత్తీస్‌గఢ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ నేత భూపేశ్ బాఘెల్‌ రాజ్‌నంద్‌గావ్‌ నుంచి పోటీ చేస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా కేరళలోని అలప్పుజ సీటు నుంచి బరిలోకి దిగారు. ఇక, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ సోదరుడు డీకే సురేశ్(కాంగ్రెస్‌), కర్నాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి (జేడీఎస్‌) కూడా శుక్రవారం జరిగే ఎన్నికలతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.