మోదీ, రాహుల్​ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ

మోదీ, రాహుల్​ కోడ్ ఉల్లంఘన... నోటీసులు జారీ
  • జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గేలకు ఎన్నికల సంఘం నోటీసులు
  • ఈ నెల 29లోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు
  • ప్రజలను రెచ్చగొట్టే కామెంట్లు చేయొద్దని వార్నింగ్

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ (సీఈసీ) షాక్ ఇచ్చింది. విద్వేష ప్రసంగాలతో ఇద్దరూ ప్రజలను రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నారని సీఈసీకి ఫిర్యాదులు వచ్చాయి. వాటిని పరిశీలించిన సీఈసీ.. కోడ్ ఉల్లంఘన జరిగినట్టు నిర్ధారించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అధ్యక్షులకు గురువారం నోటీసులు జారీ చేసింది. నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు సహకరించాలని కోరింది. ఈ నెల 29, ఉదయం 11గంటల్లోపు నోటీసులకు వివరణ ఇవ్వాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గేను సీఈసీ ఆదేశించింది. 

కాగా, ఈ నోటీసుల్లో ఎక్కడా మోదీ, రాహుల్‌ పేర్లను ఈసీ నేరుగా ప్రస్తావించలేదు. ప్రతి నోటీసుతో ఫిర్యాదు కాపీలను జత చేసింది. ఇటీవల రాజస్థాన్‌లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగంపై కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎంలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. అదే సమయంలో రాహుల్‌ గాంధీ, ఖర్గే కామెంట్లపై బీజేపీ కూడా ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ప్రచారాలు మతం, కులం, సంఘం లేదా భాష ఆధారంగా ద్వేషం, విభజనకు కారణమవుతున్నాయని ఈసీ నోటీసుల్లో పేర్కొన్నది. విద్వేష ప్రసంగాలతో ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపింది. 

ఎన్నికల కోడ్ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులు జాగ్రత్త వహించాలని సూచించింది. అభ్యర్థులు, ముఖ్యంగా స్టార్‌ క్యాంపెయినర్ల ప్రవర్తనకు రాజకీయ పార్టీలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి విద్వేష ప్రసంగాలు చేస్తే అవి తీవ్ర పరిణామాలకు దారితీస్తాయని పేర్కొంది. పీపుల్ యాక్ట్​ 1951లోని సెక్షన్ 77 ప్రకారం పార్టీ అధ్యక్షులను బాధ్యులను చేస్తూ నోటీసులు పంపిస్తున్నట్టు వెల్లడించింది.