హైదరాబాద్ జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ పనులు ప్రారంభించామని జీహెచ్ఎంసీ సూపరిండెంట్ ఇంజనీర్ మోహన్ రెడ్డి తెలిపారు. కేబీఆర్ పార్కు చుట్టూ ఏడు కిలోమీటర్ల విస్తీర్ణంలో 6 స్టీల్ ఫ్లై ఓవర్ల నిర్మాణంతో పాటు 6 అండర్ పాస్ ల నిర్మాణం చేపట్టనున్నామని చెప్పారు.
కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మాణాల కోసం రూ.1090 కోట్ల అంచనా బడ్జెట్ తో పనులు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. కేబీఆర్ చుట్టూ నిర్మాణాలను ప్యాకేజ్ వన్ ప్యాకేజ్ టూ గా ప్రణాళికలు రూపొందించి ప్యాకేజ్ వన్ పనులను ఈరోజు ప్రారంభించామని చెప్పారు. ప్యాకేజ్ వన్ పనులను మెగా కన్స్ట్రక్షన్స్ నిర్మాణం చేపట్టబోతుందన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో ప్యాకేజ్ వన్ పనుల నిర్మాణం ప్రజలకు ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్10, రోడ్ నంబర్12, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, మాసాబ్ ట్యాంక్ వైపు వెళ్లే మార్గాల్లో ప్రతిరోజూ తీవ్రమైన ట్రాఫిక్ జామ్ అవుతోంది. ముఖ్యంగా ఆఫీస్ టైమ్స్ లో, సాయంత్రం వేళల్లో గంటల తరబడి వాహనాలు నిలిచిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఇబ్బందులు పెరుగుతాయని గ్రహించిన ప్రభుత్వం రూ.1090 కోట్లతో 6 ఫ్లై ఓవర్లు, 6 అండర్ పాస్ లు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిగ్నల్ ఫ్రీ కారిడార్ గా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం ద్వారా వాహనదారుల ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించనున్నది.
ప్రత్యామ్నాయ మార్గాలు, మళ్లింపులు..
- ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి వచ్చే వారు శ్రీనగర్ కాలనీ టీ-జంక్షన్, సాగర్ సొసైటీ (ముగ్ధ) వద్ద యూటర్న్ తీసుకోవాలి. శ్రీనగర్ కాలనీ మెయిన్ రోడ్, ఇందిరానగర్ లేబర్ అడ్డా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్5, వెంకటగిరి ఎక్స్ రోడ్స్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ చేరుకోవచ్చు.
- జూబ్లీహిల్స్ రోడ్ నం.36, 45 నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్ వైపు వెళ్లేవారు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, వెంకటగిరి రోడ్ నం.2, యూసుఫ్‌గూడ బస్తీ, యూసుఫ్‌గూడ చెక్ పోస్ట్, మైత్రీవనం, అమీర్‌పేట్ మీదుగా ఇందిరానగర్ లేబర్ అడ్డా, శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట మెయిన్ రోడ్ వైపు వెళ్లాలి.
- కేసీపీ, బంజారాహిల్స్ రోడ్ నం.1 నుంచి కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్లేవారు బంజారాహిల్స్ రోడ్ నం.10 మీదుగా క్యాన్సర్ హాస్పిటల్ వద్ద ఎడమకు తిరిగి, అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నం.45 చేరుకోవచ్చు.
- మాసబ్ ట్యాంక్ నుంచి వచ్చే వారు విరించి హాస్పిటల్(1/12) వద్ద ఎడమకు తిరిగి అగ్రసేన్ ఐలాండ్, భారతీయ విద్యాభవన్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్
- నం.45 వైపు వెళ్లవచ్చు.
