చాలామందికి ఎంతకష్టపడినా.. ఎంతప్రయత్నించినా వారు తలపెట్టిన పనిలో అన్నీ అడ్డంకులే వస్తాయి. అంతా అయిపోయినట్లే ఉంటుంది.. కాని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంటుంది. అదృష్టం కలసిరావడం లేదని బాధపడుతుంటారు. జీవన విధానంలో కొన్ని నియమాలను పాటించకపోతే ఇలానే జరుగుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే.. అదృష్టం తలుపు తట్టాలంటే ఎలాంటి నియమాలు పాటించాలి.. ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి.. అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . !
పండితులు తెలిపిన వివరాల ప్రకారం భోజనం చేసే సమయంలో కొన్ని నియమాలను నిర్లక్ష్యం చేస్తే జీవితంపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు. అన్నం తినే విషయంలో కొన్ని పద్దతులను పాటించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. కోటి విద్యలు కూటి కొరకే.. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నంతినేటప్పుడు గొడవలుపడకూడదు. అస్థవ్యస్థంగా ప్రవర్తించకూడదు. అలానే తిన్న తరువాత కూడా కచ్చితంగా పరిశుభ్రతను పాటించాలి. ఇలా చేయకపోతే దరిద్రానికి స్వాగతం పలికినట్టేనని పండితులు చెబుతున్నారు.
భోజసం చేసిన తరువాత అదే ప్లేట్ లో చేయి కడగకూడదు. తినే పాత్రను శుభ్రంగా ఉంచుకోవాలి. తిన్న తరువాత కచ్చితంగా పాద ప్రక్షాళన ( కాళ్లు కడుక్కోవాలి) చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో ఒడిలో పెట్టుకొని భోంచేయకూడదు. అలాగే మంచం మీద కూర్చొని కూడా అన్నం తినకూడదు. చేయి కడుక్కున్న తరువాత మాత్రమే తిన్న కంచాన్ని తీయాలి. భోజనం చేసిన ప్రదేశంలో నీటితో శుభ్రం చేయాలి. అంటే తిన్న ప్రదేశంలో రెండు చుక్కలు నీటిని చల్లి..ముందుగా చేతితో శుబ్రం చేయాలి. కావాలనుకుంటే ఆ తరువాత తడిగుడ్డతో క్లీన్ చేసుకోవచ్చు. ఇలా చేయకపోతే దరిద్రానికి స్వాగతం పలికినట్టేనని పండితులు చెబుతున్నారు.
అన్నం తినేటప్పుడు ఆహారం ప్లేట్ బయట పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తినే వస్తువులను పారేయకూడదు కదా..! అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు కదా.. ఎంగిలి చేత్తో మళ్లీ అన్నం పెట్టుకోకూడదు. ఇంట్లో ఎక్కడపడితేఅక్కడ అన్నం మెతుకులు పడేయకుండా ఉండాలి. ఇలా చేయడం శుభ్రంగా ఉండటమే కాకుండా... మనసుపై అనుకూల ప్రభావం ఉంటుందని పెద్దలు చెబుతారు.
లక్ష్మీ దేవి కటాక్షం ఉండాలన్నా.. అదృష్టం వరించాలన్నా.. ఇల్లు శుభ్రంగా ఉండాలంటారు. భోజనం చేసేటప్పుడు అన్నం చుట్టూ పడకుండా ఉండటం... తిన్న తర్వాత తిన్న ప్లేట్ పూర్తిగా ఖాళీ అయ్యేలా ఉండాలి. అందుకే ఎంత తినగలమో అంతే పెట్టుకోవాలి. నడుస్తూ తినడం లేదా తొందరపడి భోజనం చేయడం శరీరానికి కూడా మంచిది కాదని ఆధునిక వైద్యం చెబుతున్న విషయం తెలిసిందే. సంప్రదాయాలు కూడా ఇదే విషయాన్ని ఆచారాల రూపంలో చెప్పినట్టు కనిపిస్తుంది.
అన్నం తిన్న తరువాత వేళ్లను నాకకూడదు. ఇలా చేయడం వలన పంక్తిలో భోజనం చేసేటప్పుడు పక్కనున్నవారు ఇబ్బంది పడే అవకాశం ఉంది. అలాగే ఫంక్షన్ల సమయంలో అందరూ మొదలుపెట్టే వరకు వేచి ఉండడం, అందరూ పూర్తయ్యే వరకు లేవకపోవడం వంటి పద్ధతులు సమానత్వాన్ని, ఓర్పును నేర్పుతాయని భావిస్తారు. ఇవి కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాలకే పరిమితం కాకుండా, సామాజిక విలువలను కూడా ప్రతిబింబిస్తాయి. ఇతరులతో కలిసి భోజనం చేయడం పరస్పర గౌరవాన్ని పెంచుతుంది.
అన్నం విలువ తెలుసుకుని, భోజనం చేసే ప్రతి సందర్భాన్ని ఒక పద్ధతిగా మార్చుకుంటే జీవితం కూడా ఒక క్రమంలో సాగుతుందన్న భావనను ఇవి సూచిస్తాయి. అదృష్టం అనేది ఒక్కసారిగా మారిపోదు కానీ మన అలవాట్లు మారితే పరిస్థితులు కూడా మారతాయి.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని పురాణాల ప్రకారం పండితులు నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
