అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు

అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు
  • ఒక్కోటి కనీసం 225 ఎకరాలకు తగ్గకుండా ఏర్పాటు
  • లోకల్ పంటలను బట్టి ఫుడ్ మ్యాప్
  • అధికారులతో కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: అన్ని జిల్లాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ లు ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఒక్కో యూనిట్ (జోన్) కనీసం 225 ఎకరాలకు తగ్గకుండా ఉంటుందన్నారు. బుధవారం టీఎస్‌‌‌‌ఐఐసీ ఆఫీసులో ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ జోన్‌‌‌‌ల ఏర్పాటుపై మంత్రులు నిరంజన్‌‌‌‌ రెడ్డి, గంగుల కమలాకర్‌‌‌‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పంటల ఆధారంగా తెలంగాణ ఫుడ్‌‌‌‌ మ్యాప్‌‌‌‌ తయారు చేశామని, వీటి ప్రకారమే ప్రాసెసింగ్‌‌‌‌ జోన్‌‌‌‌లు ఉంటాయన్నారు. వీటిలో కరెంట్‌‌‌‌, రోడ్లు, తాగునీరు, వ్యర్థాల నిర్వహణ, కామన్‌‌‌‌ అప్లుయంట్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ వంటి అన్ని వసతులు కల్పిస్తామన్నారు. వరి, మిరప, పసుపు, చిరుధాన్యాలు, వంట నూనెలు, పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌‌‌‌, నిల్వ, మార్కెటింగ్‌‌‌‌ ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే పిలిచిన ఎక్స్‌‌‌‌ప్రెషన్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ఇంట్రస్ట్‌‌‌‌కు 350 అప్లికేషన్‌‌‌‌లు వచ్చాయని, మరిన్ని కంపెనీలను భాగస్వామ్యం చేసేందుకు వీలుగా గుడువు పొడిగించాలని అధికారులను ఆదేశించారు. భూసేకరణ, తదితర అంశాలపై ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు. మంత్రి నిరంజన్‌‌‌‌రెడ్డి మాట్లాడుతూ.. ఫుడ్‌‌‌‌ ప్రాసెసింగ్‌‌‌‌ జోన్‌‌‌‌ల ఏర్పాటుతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. రైతుల పంటలకు లాభసాటి ధరలు వస్తాయన్నారు. ఇది శాశ్వత డిమాండ్‌‌‌‌ ఉన్న రంగమని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయన్నారు. ధాన్యం మిల్లింగ్‌‌‌‌ కెపాసిటీ పెంచేందుకూ ఈ జోన్‌‌‌‌లలో ఏర్పాట్లు చేస్తామని మంత్రి గంగుల అన్నారు.