20 లక్షలకు మించిన లావాదేవీలకు కొత్త రూల్

20 లక్షలకు మించిన లావాదేవీలకు కొత్త రూల్

ఏడాదికి రూ.20 లక్షలకు మించి క్యాష్ డిపాజిట్ చేస్తే.. ఇకపై పాన్, ఆధార్ వివరాలు తప్పకుండా బ్యాంకుకు సమర్పించాల్సి ఉంటుంది. ఈమేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)  కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒక్కరోజులో రూ.50వేలకు మించి బ్యాంకులో డిపాజిట్ చేసే వారి పాన్ కార్డు వివరాలను సేకరించే నిబంధన ఇప్పటికే అమల్లో ఉంది. అయితే ఒక ఏడాది వ్యవధిలో నిర్దిష్ట మొత్తానికి (రూ.20 లక్షలు) మించి డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ వివరాలను సమర్పించాలని నిర్దేశించడం ఇదే తొలిసారి. ఏడాది వ్యవధిలో వివిధ బ్యాంకుల ద్వారా జరిగే భారీ డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ లావాదేవీలను ఆదాయపు పన్ను విభాగం ట్రాక్ చేసేందుకు ఖాతాదారుల ఆధార్, పాన్ వివరాలు ఉపయోగపడతాయి. 20 లక్షలకు మించి బ్యాంకు డిపాజిట్ చేసేవారి వద్ద ఒకవేళ పాన్ నంబర్ లేకుంటే.. ఆ లావాదేవీ చేయడానికి వారం ముందు పాన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్లుగా ధ్రువీకరించే రశీదును బ్యాంకులో సమర్పించాల్సి ఉంటుంది. ఆర్థిక కుంభకోణాలు, అక్రమ లావాదేవీలకు అడ్డుకట్ట వేసే ఉద్దేశంతోనే పెద్దఎత్తున జరిగే లావాదేవీలకు ఆధార్, పాన్ ను అనుసంధానం చేసినట్లు తెలుస్తోంది.