మెటబాలిజం సరిగా జరిగాలంటే...

మెటబాలిజం సరిగా జరిగాలంటే...

మెటబాలిజం అనేది తిన్న వాటిని ఎనర్జీగా మార్చే ప్రక్రియ. అది శరీరాన్ని ఫిట్‌‌గా, ఆరోగ్యంగా ఉంచుతుంది. ఉదయం లేవగానే నీరసంగా, బద్ధకంగా అనిపించేవాళ్లు యోగాసనాలు చేసి మెటబాలిజం సరిగా జరిగేలా చేసుకోవచ్చు. యోగాసనాల వల్ల శరీరంలో క్యాలరీలు కరిగి, బరువు తగ్గుతారు. ఇవే కాకుండా ఇంకా చాలా లాభాలున్నాయి అంటుంది యోగా ట్రైనర్‌‌‌‌ సురభి సచ్‌‌దేవ. 

ముఖ ధౌతి ఆసనం 

పొట్ట లోపలికి బాగా గాలి పీల్చి, వదులుతూ ఈ ఆసనం వేయాలి. ఇలా చేయడం వల్ల జీర్ణ వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ శుభ్ర పడతాయి. చెవులు, కాళ్లపై ఎఫెక్ట్‌‌ ఉంటుంది. రెండు కాళ్లను కొంచెం ఎడం జరిపి చేతులతో మోకాళ్లను పట్టుకోవాలి. తరువాత కొంచెం ముందుకు వంగి ముక్కుతో బలంగా గాలిపీల్చుకోవాలి. గాలి పీల్చినప్పుడు పొట్టను సాధ్యమైనంత లోపలికి అనాలి. తరువాత నోటితో ఒక్కసారిగా గాలి బయటికి వదిలి పొట్టను బయటికి అంటూ ఈ ఆసనాన్ని వేయాలి.

మలాసనం  
కాళ్లను కొంచెం వెడల్పు చేసి ఇండియన్ టాయిలెట్‌‌ పొజిషన్‌‌లో కూర్చోవాలి. వెన్నెముక నిటారుగా ఉంచి, పెల్విస్‌‌ పైకి లేపాలి. మోచేతులను మోకాళ్ల పైన ఉంచి నమస్కారం చేయాలి. గట్టిగా ఊపిరి పీల్చుతూ వదలాలి. ఈ ఆసనం వేయడం వల్ల శరీర బ్యాలెన్స్‌‌ పెరుగుతుంది. ఏకాగ్రత ఉంటుంది. పెల్విస్‌‌కు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మలాసనం వేసేముందు వేడినీళ్లు తాగితే మెటబాలిజమ్‌‌ పెరుగుతుంది.

భస్త్రికాసనం

మెదడుకు ఆక్సిజన్‌‌ సరఫరా బాగా జరగ డానికి, ఎనర్జీ, రిలాక్సేషన్‌‌ ఇవ్వడానికి, యాంగ్జైటీని దూరం చేయడానికి భస్త్రికాసనం సాయపడుతుంది. ఈ ఆసనాన్ని ఎలా చేయాలంటే..  పద్మాసనం లేదా మోకాళ్ల మీద నిటారుగా కూర్చోవాలి. చేతులు పైకెత్తి గాలి పీల్చాలి. వస్తువును లాగినట్టు చేతుల్ని కిందికి అని గాలి వదలాలి. గాలి పీల్చుతూ వదులుతున్న ప్పుడు ఛాతి భాగం కిందికి పైకి వెళ్లాలి.  

కపాలభాతి

ఈ ఆసనం చేయడంవల్ల మెదడు పనితీరు మెరుగుపరిచి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. శరీరంలోనుంచి చెత్త బయటికి పోతాయి. ఆ ఆసనం జీర్ణ సమస్యల్ని పోగొడుతుంది. రక్తం శుభ్రపడుతుంది. మెటబాలిజం పెరుగుతుంది. పొట్టలో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది. పద్మాసనంలో కూర్చొని కళ్లు మూసుకోవాలి. ముక్కు ద్వారా గట్టిగా గాలిపీల్చుతూ పొట్టను లోపలికి అనాలి. తరువాత గట్టిగా గాలి వదిలి పొట్టను కూడా ముందుకు అనాలి.

నోట్‌‌: ట్రైనర్‌‌‌‌ దగ్గర నేర్చుకున్న తరువాతే సొంతంగా ప్రయత్నించాలి. ఈ ఆసనాలను ఖాళీ కడుపుతోనే చేయాలి. గర్భిణులు, మైగ్రేన్‌‌, గుండె సమస్యలు, వికారం, హై బీపీ, తల తిరగడం, అల్సర్‌‌‌‌ సమస్యలు ఉన్నవాళ్లు ఈ ఆసనాలు చేయకూడదు.