- ఫారెస్ట్ పర్మిషన్లు రాక నాలుగేండ్లుగా నిలిచిన పనులు
- పూర్తయితే ఎల్కతుర్తి– సిద్దిపేట రాకపోకలు ఈజీ
సిద్దిపేట, వెలుగు: ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట వరకు జరుగుతున్న నేషనల్ హైవే(765డీజీ) పనులకు ఆటంకం తొలగిపోయింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నాగసముద్రాల, రామాయంపేట మండలంలో అటవీ ప్రాంతాల మీదుగా ఈ రోడ్డును నిర్మించనున్నారు. నాలుగేండ్ల కింద ఈ హైవే పనులు ప్రారంభమైనా ఫారెస్ట్డిపార్ట్మెంట్ అనుమతులు లభించకపోవడంతో రెండు చోట్ల పనులు ఆగిపోయాయి ఇటీవల ఫారెస్ట్ పర్మిషన్ రావడంతో త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.
స్లోగా సాగుతున్న పనులు
మెదక్ నుంచి సిద్దిపేట మీదుగా ఎల్కతుర్తి వరకు 765 డీజీ హైవే పనులను2022లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. మొత్తం 133 కి.మీ రోడ్డు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1461 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి మొదటి ప్యాకేజీని మెదక్ నుంచి సిద్దిపేట వరకు 69 కి.మీకు గానూ రూ. 822 కోట్లు, రెండో ప్యాకేజీ కింద సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు 63 కి.మీకు గానూ రూ.579 కోట్లు కేటాయించారు. రెండో ప్యాకేజీ పనులు 2024 డిసెంబర్ వరకు పూర్తి చేయాల్సి ఉన్నా ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ పర్మిషన్లు రావడంలో ఆలస్యమైంది. దీంతో పలు చోట్ల అనుమతులతో పాటు ఫ్లై ఓవర్ల పనులు నత్తననడకన సాగాయి. కాగా ఎల్కతుర్తి–సిద్దిపేట హైవే కోహెడ క్రాసింగ్, రామాయంపేట వద్ద ఫారెస్ట్ నుంచి వెళ్తోంది. కోహెడ క్రాసింగ్ నుంచి గండి మైసమ్మ దేవాలయం వరకు దాదాపు 1.5 కి.మీ, రామాయంపేట సమీపంలో 3 కి.మీ అటవీ ప్రాంతంలో పనులు ప్రారంభం కాలేదు. రెండు ప్రాంతాల్లో దాదాపు 4.5 కి.మీ మేర ఎక్కువ మలుపులు ఉండడంతో స్థల సేకరణ తప్పనిసరి అయింది.
మధ్యలో నిలిచిన ఫ్లై ఓవర్ పనులు
సిద్దిపేట– హుస్నాబాద్ మార్గంలో మిట్లపల్లి వద్ద రైల్వే క్రాసింగ్ వద్ద ఫ్లై ఓవర్ పనులు దాదాపు రెండేండ్లుగా పనులు నిలిచిపోయాయి. ఫ్లై ఓవర్ పనులు యాభై శాతం మేర పూర్తి కాగా మిగిలిన పనులపై సందిగ్ధం నెలకొంది. మరోవైపు రంగథాంపల్లి చౌరస్తా వద్ద అండర్ పాస్ పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. స్థానికుల అభ్యంతరం వల్ల ఇక్కడి ఫ్లై ఓవర్ బ్రిడ్జికి బదులు రైల్వే అండర్ పాస్ నిర్మించాలని నిర్ణయించినా ఇంతవరకు పనులను ప్రారంభించలేదు. దీంతోపాటు సిద్దిపేట పట్టణ శివార్లలోని బైపాస్‌లో హైవే పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఎన్సాన్ పల్లి చౌరస్తా వద్ద ఫ్లైవర్ పనులు నిలిచిపోగా రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బ్లాక్ ఆఫీస్ చౌరస్తా వరకు పలు చోట్ల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.
త్వరలో పనులు ప్రారంభం
సిద్దిపేట నుంచి మెదక్ వరకు నేషనల్ హైవే(765 డీజీ) పనులను త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రామాయంపేట వద్ద అటవీ ప్రాంతం మీదుగా పనులు చేసేందుకు ఇటీవల పర్మిషన్ వచ్చింది. త్వరలోనే పనులను ప్రారంభిస్తాం.
-అన్నయ్య, డీఈ నేషనల్ హైవే, సిద్దిపేట
