ఇకపై ఆక్రమించే భూములకు పట్టాలివ్వరు

ఇకపై ఆక్రమించే భూములకు పట్టాలివ్వరు

కామారెడ్డి, వెలుగు: అటవీ శాఖ భూములను ఆక్రమిస్తూ ఆఫీసర్లపై దాడులకు పాల్పడితే పీడీ యాక్ట్ ​ప్రయోగిస్తామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ​జితేశ్ పాటిల్​చెప్పారు. గురువారం కలెక్టరేట్​లో ఎస్పీ శ్వేత, డీఎఫ్ఓ నిఖితతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2005 డిసెంబర్13కు ముందు వరకు సాగు చేసుకున్న ఫారెస్ట్​భూములకు మాత్రమే పట్టాలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే గ్రామాల వారీగా కమిటీలు వేసి అప్లికేషన్లు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 20 వేల అప్లికేషన్లు వచ్చాయని వెల్లడించారు. కానీ కొందరు ప్రస్తుతం ఫారెస్టు ల్యాండ్​ను ఆక్రమించి సాగు చేస్తే పట్టాలొస్తాయని భావిస్తున్నారని, అలా చేయడం కరెక్ట్​ కాదన్నారు. 

అటవీ భూములను ఆక్రమించే ప్రయత్నం చేసినా, చెట్లు నరికినట్లు గుర్తించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ శ్వేత మాట్లాడుతూ.. లింగంపేట మండలం కొండాపూర్​శివారులో ఇటీవల ఫారెస్ట్​ ఆఫీసర్లపై దాడికి పాల్పడిన దండు హన్మంతు, గుర్రపు చిన్నసాయిలు, గణేశ్, లక్ష్మణ్, లవన్​కుమార్ గురువారం అరెస్టు చేసినట్లు తెలిపారు. 4 ట్రాక్టర్లు సీజ్​చేయడంతోపాటు నిందితులపై నాన్​బెయిలబుల్​కేసులు ఫైల్​ చేసినట్లు వెల్లడించారు. పోశయ్య అనే వ్యక్తి పరారీలో ఉన్నట్లు చెప్పారు. డీఎఫ్ఓ నిఖిత మాట్లాడుతూ.. చెట్లు నరకొద్దని ఎంత ప్రచారం చేసినా జిల్లాలో ఆక్రమణలు జరుగుతుండడం దురదృష్టకరం అన్నారు. ఈ మధ్యనే బాన్స్​వాడ, నస్రుల్లాబాద్, గాంధారి, లింగంపేట, పిట్లం మండలాల్లో స్థానికులు ఆక్రమణలు చేయడంతోపాటు, సిబ్బందిపై దాడి చేశారన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్​వెంకటేశ్ ​దొత్రే పాల్గొన్నారు.