మార్కాపురం జిల్లాలో గుప్తనిధుల కలకలం... ఫారెస్ట్ ఆఫీసర్లే తవ్వించారు...!

మార్కాపురం జిల్లాలో గుప్తనిధుల కలకలం... ఫారెస్ట్ ఆఫీసర్లే తవ్వించారు...!

గుప్తనిధులు... అమ్మమ్మలు, తాతలు చెప్పిన కథల్లో, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో వీటి గురించి చాలాసార్లు విన్నాం, చూశాం. గుప్త నిధుల చుట్టూ అల్లిన కథలు చాలానే ఉన్నాయి. గుప్తనిధులు దొరికితే లైఫ్ సెటిల్ అనుకునేవారు చాలామంది ఉంటారు. పురాతన గుడులు,కోటల్లో వీటి కోసం తవ్వకాలు జరిపినోళ్లు కూడా ఉన్నారు. గుప్తనిధులు దొరికినవారు ఎంతమంది ఉన్నారో తెలీదు కానీ... తవ్వకాలు జరిపి పోలీసులకు పట్టుబడ్డవారు చాలామందే ఉన్నారు. మార్కాపురంలో కూడా ఇలాగే గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపారు. ఏకంగా ఫారెస్ట్ ఆఫీసర్లే తవ్వకాలు జరిపారని... తవ్వకాల్లో దొరికిన వజ్రాలు, బంగారం ఉన్న కుండలు బెంగుళూరులో అమ్ముకున్నారని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..

ఏపీలోని మార్కాపురంలో గుప్తనిధుల కలకలం రేగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం లో ఫారెస్ట్ అధికారుల పాత్ర పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జేసీబీతో తవ్వి బంగారం కుండలు వెలికితీసారని సోషల్ మీడియాలో కథనాలు వైరల్ గా మారాయి. మార్కాపురం జిల్లా గిద్దలూరు టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల్లో లంకెబిందెలు బయటపడ్డాయన్న సమాచారం కలకలం రేపుతోంది. 

ఓ గుప్తనిధుల ముఠా ఇచ్చిన సమాచారంతో అటవీశాఖ అధికారులు గుప్త నిధులను తవ్వి అందులో లభించిన లంకెబిందెల్లోని సొమ్ము స్వాహా చేసినట్టు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తురిమెళ్ళ ఫారెస్ట్ ఆఫీసర్లు.. ట్రైబల్ వాచర్లతో కలిసి గుప్తనిధులు తవ్వకాలు జరిపినట్లు అనుమానిస్తున్నారు.ఈ తవ్వకాల్లో ఓ రెండు పెద్ద మట్టి కుండలు బయటపడగా అందులో వజ్రాలు, బంగారం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది.

దొరికిన బంగారం, వజ్రాలను తొలుత హైదరాబాద్‌లో అమ్మేందుకు ప్రయత్నించి అది విఫలం కావడంతో బెంగళూరులో అటవీశాఖ అధికారులు అమ్ముకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.అయితే.. ఈ సమాచారం గురించి అటవీశాఖ అధికారులను మీడియా వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికారుల నుండి ఎలాంటి స్పందన రాలేదు.

వెలగలపాయ ఫారెస్ట్‌ బీట్‌ అధికారికి యర్రగొండపాలెంకు చెందిన కొందరు గుప్తనిధుల ముఠా సభ్యులు విచారణ సందర్భంగా ఇచ్చిన సమాచారం మేరకు ఈ తవ్వకాలు చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. స్థానికుల సంచారంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూసే అవకాశం ఉంది.