-
ఛలో నల్లమల
-
జంగిల్ సఫారీ స్టార్ట్
-
మూడు నెలలుగా నిలిచిన జర్నీని తిరిగి మొదలు పెట్టిన ఆఫీసర్లు
-
ప్యాకేజీలో సఫారీ, కాటేజీలో రాత్రి బస, ట్రెక్కింగ్‌కు ఛాన్స్
-
అందుబాటులో ఆన్‌లైన్ బుకింగ్ విధానం
అమ్రాబాద్, వెలుగు :మూడు నెలలుగా మూతపడిన నల్లమల జంగిల్ సఫారీ తిరిగి ప్రారంభం కానుంది. అటవీ జంతువుల ప్రత్యుత్పత్తి కాలం కారణంగా ఆఫీసర్లు గతంలో జంగిల్ సఫారీని నిలిపివేశారు. సుమారు మూడు నెలల విరామం అనంతరం మంగళవారం నుంచి సఫారీని ప్రారంభించేందుకు ఆఫీసర్లు సర్వం సిద్ధం చేశారు.
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో బుకింగ్
మూడు నెలల విరామం అనంతరం సఫారీ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేపట్టిన ఆఫీసర్లు ఇందుకు ఆన్‌లైన్ బుకింగ్‌ను సైతం అందుబాటులోకి తెచ్చారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ చేయాలనుకునే వారు ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా గానీ, లేదంటే ఆఫ్‌లైన్ ద్వారా గానీ సఫారీని బుక్ చేసుకోవచ్చు. www.amrabaadtigerreserve.com వెబ్‌సైట్‌లో ప్యాకేజీని బుక్ చేసుకోచ్చు. ఇద్దరు వ్యక్తులకు కాటేజీని బట్టి రూ. 5,100 నుంచి రూ. 8,500 వరకు అందుబాటులో ఉన్నాయి. ఇందులో చెంచు హట్ రూ. 7,500, చీతల్ డార్మెట్రీ రూ. 6,500, మడ్ హౌజ్ రూ. 7,000, ఫర్హ ట్రీ హౌజ్ రూ. 8,500, స్టాండర్డ్ రూం రూ. 5,100 చొప్పున ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చారు. ఒక్కోకాటేజీలో ఇద్దరు వ్యక్తులు ఉండేందుకు అవకాశం ఉంటుంది. నలుగురికి రూ.20 వేల ప్యాకేజీ, ఎనిమిది మందికి రూ. 40 వేల ప్యాకేజీ సైతం అందుబాటులో ఉన్నాయి. ఈ ప్యాకేజీలలో జంగిల్ సఫారీ, రాత్రి బస, ఉదయం ట్రెక్కింగ్ ఉండనున్నాయి. ఫుడ్ ఖర్చును మాత్రం టూరిస్ట్‌లే ప్రత్యేకంగా భరించాల్సి ఉంటుంది.
సఫారీ సాగేదిలా...
అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో సఫారీ బుక్ చేసుకున్న వారు మధ్యాహ్నం 12 గంటలకు మన్ననూరు చెక్‌పోస్ట్ వద్దకు చేరుకొని రిపోర్ట్ చేయాలి. అక్కడ మధ్యాహ్నం 3 తర్వాత సఫారీ స్టార్ట్ అవుతుంది. గుండం బేస్ క్యాంప్ మీదుగా అడవిలో సంచరిస్తూ చిరుతలు, సాంబార్ జింకలు, వివిధ రకాల సరీసృపాలతో పాటు టైగర్‌ను చూసే అవకాశం కలుగుతుంది. తర్వాత ఫర్హాబాద్ వ్యూ పాయింట్ నుంచి నల్లమల నలుదిక్కులనూ చూడొచ్చు. రాత్రి 7.30 నుంచి 8 గంటల మధ్య తిరిగి మన్ననూర్ చేరుకుంటారు.
అక్కడ చెంచుల జీవనవిధానంతో అడవికి సంబంధించిన పలు విషయాలపై అవగాహన కల్పిస్తారు. రాత్రి బస తర్వాత ముందుగానే బుక్ చేసుకున్న వారికి ఉదయం 6 గంటలకు ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. మన్ననూరు నుంచి ప్రతాపరుద్రుని కోట వరకు ఒక రూట్, మన్ననూరు నుంచి ఉమామహేశ్వరం వరకు మరో రూట్‌లో ట్రెక్కింగ్‌కు తీసుకెళ్తారు. తర్వాత ఉదయం 10 గంటలకు చెక్ అవుట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి ప్యాకేజీ కాకుండా సఫారీకి మాత్రమే వెళ్లాలనుకునే వారు డైరెక్ట్‌గా ఫర్హాబాద్ వ్యూపాయింట్ వద్దకు చేరుకోవాలి. అక్కడి నుంచి సఫారీ వాహనంలో అడవిలోకి తీసుకెళ్లి తర్వాత తిరిగి వ్యూపాయింట్ వద్ద వదిలేస్తారు.
సఫారీ, ట్రెక్కింగ్‌లో చెంచుల భాగస్వామ్యం
సఫారీ వాహనంలో ఏడుగులు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. డ్రైవర్, సఫారీ గైడ్‌గా చెంచు యువకులకు ప్రాధాన్యం కల్పించారు. వారికి ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చి టూరిస్ట్‌లకు అడవిలోని జంతువులు, చెట్ల గురించి అవగాహన కల్పిస్తారు. గైడ్‌కు ఒక్కో టూరిస్ట్ రూ. 100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.
ప్లాస్టిక్‌పై నిషేధం
నల్లమల అభయారణ్యం ప్రకృతి అందాలతో పాటు అనేక వన్యప్రాణులు, టైగర్‌కు నిలయం. ఈ ప్రాంతంలో పర్యటించే పర్యాటకులు ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావద్దు. సఫారీతో పాటు శ్రీశైలం వెళ్లే భక్తులు సైతం ప్లాస్టిక్ వాడకుండా అవసరమైన సూచనలు చేస్తున్నాం. జంగిల్ సఫారీ మొదలైనందున ప్లాస్టిక్ ఆంక్షలను మరింత కఠినంగా నిర్వహిస్తున్నాం. పర్యాటకులు, ప్రజలు సహకరించాలి.
– రామ్మూర్తి, ఎఫ్‌డీవో–
నల్లమల అభివృద్ధికి సహకరించాలి
నల్లమల కొండలు ప్రకృతి రమణీయతకు, వన్యప్రాణుల మనుగడకు, పర్యాటక ప్రాంతాలు, జీవ వైవిధ్యానికి నిదర్శనం. ఈ అడవిలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తెస్తాం. స్థానికులు, పర్యాటకులు, భక్తులు అటవీశాఖ సిబ్బందితో సహకరించి ప్లాస్టిక్‌కు దూరంగా ఉండాలి. అటవీ చట్టాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.
– రోహిత్ గోపిడి, డీఎఫ్‌వో–