ఇనుపరాతి గుట్టలనూ పట్టా చేసిన్రు

ఇనుపరాతి గుట్టలనూ పట్టా చేసిన్రు
  • దేవునూరులో 142 ఎకరాలకు పాస్​బుక్​లు ఇచ్చిన రెవెన్యూ ఆఫీసర్లు
  • గతంలో ఇష్టారీతిన రిజిస్ట్రేషన్ చేసిన ఓ తహసీల్దార్
  • ఆ స్థలం మాదేనంటూ బోర్డు ఏర్పాటు చేసిన ఫారెస్ట్ డిపార్ట్ మెంట్​
  • రూల్స్​కు విరుద్ధంగా రైతుబంధు చెల్లింపు

హనుమకొండ, వెలుగు: ఫారెస్ట్​ ఏరియాలో పట్టాలు పుట్టుకొచ్చాయి. అక్రమాలను అడ్డుకోవాల్సిన ఆఫీసర్లే సహకరించడం.. అటవీశాఖ పట్టించుకోకపోవడంతో రైతుల మాటున చాలామందికి పట్టాదారు పాసు బుక్​లు ఇష్యూ అయ్యాయి. అదంతా సాగుకు యోగ్యంగా లేని గుట్ట ప్రాంతమే అయినా ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుబంధు, పీఎం కిసాన్​ యోజన డబ్బులు అక్కమార్కుల జేబుల్లోకి చేరుతున్నాయి.  ఫిజికల్​గా వారి ల్యాండ్​ ఎక్కడుందో తెలియకున్నా.. క్రయవిక్రయాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. హనుమకొండ జిల్లా ధర్మసాగర్​ మండలంలోని దేవునూరు ఇనుపరాతి గుట్టల్లో ఉన్న ఫారెస్ట్​ భూముల పరిస్థితి అందరినీ గందరగోళానికి గురి చేస్తోంది. అటవీ, పట్టా భూములకు మధ్య హద్దులు లేకపోవడం.. రెవెన్యూ, ఫారెస్ట్​డిపార్ట్​మెంట్లు నిర్లక్ష్యం చేస్తుండటం వల్లే ఫారెస్ట్​ ల్యాండ్స్​ఆక్రమణకు గురవుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బై నంబర్లు సృష్టించి..

హనుమకొండ జిల్లాలో అటవీ విస్తీర్ణం కే వలం ఒక శాతం మాత్రమే. ఆ కొంచెం కూడా ధర్మసాగర్, వేలేరు, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి మండలాల్లోని ఇనుపరాతి గుట్టల్లోనే 4,880 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ధర్మసాగర్​ మండలం దేవునూరు శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో కొంత భూమిని అప్పట్లో ఇక్కడ పని చేసిన ఓ తహసీల్దార్​ అక్రమంగా కొందరికి పట్టా చేశారనే ఆరోపణలున్నాయి. గ్రామంలోని సర్వే నం.531కు బై నంబర్లు సృష్టించి దాదాపు 142 ఎకరాల అటవీ భూమికి కొంతమంది పేరున అక్రమంగా పట్టాదారు పాస్​బుక్స్​ఇచ్చారు. కానీ ఆ ల్యాండ్​ అంతా ఫారెస్ట్​డిపార్ట్​మెంట్​కు చెందినదేనని సంబంధిత అధికారులు అక్కడ ఓ బోర్డు ఏర్పాటు చేశారు. మరోవైపు గవర్నమెంట్​ రికార్డ్స్​ ప్రకారం ల్యాండ్ ఎవరి పేరు మీద ఉందో వారికి ఏటా ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రైతుబంధు 10 వేలు, పీఎం కిసాన్​ సమ్మాన్​ నిధి నుంచి రూ.6 వేలు వారి అకౌంట్లలో జమవుతున్నాయి. ఈ లెక్కన 142 ఎకరాలకు ఏటా 16 వేల చొప్పున మొత్తం రూ.22 లక్షలకు పైగా వారివారి అకౌంట్లలోకి వెళ్తున్నాయి. అంటే ఇప్పటికే దాదాపు రూ.70లక్షలకు పైగా వారికి డిపాజిట్ అయినట్లు తెలుస్తోంది.

హద్దులు తెలియక ఆగమాగం

ఇనుపరాతి గుట్టల్లో అటవీ భూముల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.  పట్టా ల్యాండ్​ ఎక్కడుందో..  ఫారెస్ట్​ ల్యాండ్​ ఎక్కుడుందో ఆఫీసర్లకే సరిగా తెలియడం లేదంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతోనే చాలామంది అటవీ భూములను ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట ఓ వ్యక్తి దాదాపు 30 ఎకరాల భూమిని ఆక్రమించాడు. ల్యాండ్​కు దర్జాగా రాత్రికి రాత్రే కరెంట్​ పోల్స్​కూడా వేయించాడు. చివరకు ఫారెస్ట్​ ఆఫీసర్లు అడ్డుకుని అక్కడ వర్క్స్​నిలిపివేయించారు. పోల్స్​తొలగించి ఫారెస్ట్​ ల్యాండ్​ను ప్రొటెక్ట్​ చేస్తామని చెప్పిన ఆఫీసర్లు ఆ తరువాత లైట్​ తీసుకున్నారు. దీంతో ఆ వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆ తరువాత కూడా కొందరు  అది తమ భూమేనంటూ ఇతరులకు అమ్ముకునే ప్రయత్నాలు చేశారు. పలుసార్లు ల్యాండ్ పరిశీలించేందుకు వెళ్లగా వారిని అటవీ సిబ్బంది అడ్డుకుని అక్కడి నుంచి పంపించేశారు. ఇలా వివాదాస్పదమవుతున్న చోట్ల ఫారెస్ట్ ఆఫీసర్లు బోర్డులు ఏర్పాటు చేస్తూ పోతున్నారు తప్ప శాశ్వత పరిష్కారానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇదిలా ఉంటే కొంతమంది సర్వే నం. 531కు సంబంధించిన బై నంబర్​ భూముల్లో మైనింగ్​ కోసమని అప్లికేషన్​ పెట్టుకున్నారు. దీంతో గత ఆగస్టు చివరివారంలో పీసీబీ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టగా.. దీనికి జిల్లా కలెక్టర్​ రాజీవ్​ గాంధీ హనుమంతు కూడా హాజరై ప్రజల ఒపీనియన్స్​ సేకరించారు. అవన్నీ ఫారెస్ట్​ భూములని అటవీశాఖ అధికారులు బోర్డులు ఏర్పాటు చేస్తుంటే.. అక్కడే మైనింగ్ కోసం ఆఫీసర్లు ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

కాగితాలపైనే రిజర్వ్​ఫారెస్ట్​ 

ఇప్పటికే దేవునూరు ఇనుపరాతి గుట్టలకు సంబంధించిన ల్యాండ్​ మాదంటే మాదన్నట్లుగా పట్టాదారులు, ఫారెస్ట్​ ఆఫీసర్ల నడుమ ఇంటర్నల్​ ఫైట్​నడుస్తోంది. ఓ వైపు ఫారెస్ట్​ల్యాండ్​ఆక్రమిస్తున్నారని అధికారులు బోర్డులు ఏర్పాటు చేసుకుంటూ పోతుండగా.. అదంతా తమ ల్యాండేనని అక్రమార్కులు ఎక్కడికక్కడ చొరబడుతున్నారు. కానీ జిల్లాలో ఉన్న ఏకైక అటవీ ప్రాంతం కావడం.. ఇక్కడ వివిధ జీవజాతులు, ఔషధ మొక్కలు, పర్యాటక స్థలాలు కూడా ఉండటంతో ఈ నాలుగు మండలాల్లోని ఇనుపరాతి గుట్టల్లో ఉన్న అటవీ ప్రాంతాన్ని రిజర్వ్​ ఫారెస్ట్ గా ప్రకటించాలనే ప్రపోజల్ ఎప్పటినుంచో ఉంది. ఇదివరకు ఆమ్రపాలి కలెక్టర్​గా ఉన్న సమయంలో ఆ విషయంలో పలుసార్లు ఆఫీసర్లతో రివ్యూలు పెట్టి అటవీ సంరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ తరువాత వచ్చిన అధికారులు ఎవరూ పెద్దగా ఆ అంశాన్ని పట్టించుకోలేదు. దీంతో ఇప్పటికీ అడపాదడపా ఆక్రమణలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇకనైనా ఇనుపరాతి గుట్టల ప్రాంతాన్ని రిజర్వ్​ ఫారెస్ట్ గా ప్రకటించి సంరక్షించాలని పర్యావరణ ప్రేమికులు, సమీప గ్రామస్తులు కోరుతున్నారు.

కోఆర్డినేషన్​ లేక ఇబ్బంది

దేవునూరు అటవీ ప్రాంతంలో అక్రమ పట్టాలతో పాటు ఆక్రమణల విషయం తరచూ తెరపైకి వస్తూనే ఉంది. కానీ ఇటు రెవెన్యూ నుంచి గానీ.. అటు ఫారెస్ట్ ఆఫీసర్ల నుంచిగానీ సీరియస్​ యాక్షన్​ లేకపోవడం వల్లే ఇదంతా జరుగుతున్నట్లు తెలుస్తోంది. అటవీ భూములను రక్షించకపోగా వాటికే  పట్టాలివ్వడం.. ఆ తరువాత రైతుబంధు చెల్లించడం కూడా ఆఫీసర్ల సమన్వయ లోపాన్ని కండ్లకు కడుతోంది. అటవీ భూముల రక్షణకు ఫారెస్ట్​ ఆఫీసర్లే చొరవ తీసుకోవాలని రెవెన్యూ ఆఫీసర్లు చెబుతుండగా.. ఎన్నిసార్లు లెటర్​ రాసినా జాయింట్​ సర్వే చేసి హద్దులు పెట్టడం లేదని ఫారెస్ట్​ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. ఈ రెండు డిపార్ట్​ మెంట్ల విషయం ఇలా ఉంటే.. ల్యాండ్​ తో సంబంధం లేకుండా పట్టాదారు పాసు బుక్​ లు ఉన్న అక్కడి రైతులందరికీ  రైతుబంధు చెల్లిస్తున్నట్లు వ్యవసాయాధికారులు చెబుతుండటం గమనార్హం.

ఇప్పటికే లెటర్లు రాశాం

దేవునూరు అటవీ భూముల్లో కొంతమంది ఆక్రమణలకు ప్రయత్నిస్తే వారిని అడ్డుకున్నాం. ఆ తరువాత ఫారెస్ట్​ ల్యాండ్​కు హద్దులు నిర్ణయించాల్సిందిగా రెవెన్యూ ఆఫీసర్లకు పలుసార్లు లెటర్ పెట్టాం. ఇంతవరకు దానిపై ఎలాంటి యాక్షన్​ లేదు. వారు బౌండరీ నిర్ణయిస్తే ఫెన్సింగ్​ఏర్పాటు చేసి అటవీ భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకుంటాం. 

- భిక్షపతి, ఫారెస్ట్​ రేంజ్​ ఆఫీసర్