విదేశాల నుంచి ఆటో దిగుమతులు ఆపేస్తే రూ.70వేల కోట్ల ఫారెక్స్ సేవ్.. మోడీ సాబ్ జర ఫోకస్ పెట్టుర్రి!

విదేశాల నుంచి ఆటో దిగుమతులు ఆపేస్తే రూ.70వేల కోట్ల ఫారెక్స్ సేవ్.. మోడీ సాబ్ జర ఫోకస్ పెట్టుర్రి!

ప్రధాని మోడీ దేశ ప్రజలందరూ పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించుకోవాలని దీంతో విలువైన ఫారెక్స్ రిజర్వ్స్ సేవ్ అవుతాయని పిలుపునిచ్చారు. అయితే రోడ్లపై తిరుగుతున్న ప్రతి 10 కార్లలో కనీసం రెండు విదేశీల నుంచి దిగుమతి చేసుకున్న లగ్జరీ మోడళ్లే. సామాన్య మధ్యతరగతి ప్రజలు అనవసరంగా దేశ సంపదను పాడుచేస్తున్నారనే ధోరణిలో చాలా మంది మాటలు చెబుతూ.. వాళ్లు మాత్రం లగ్జరీ కార్లలో తిరుగుతున్నారనే వాదన వినిపిస్తోంది. సాధారణ ప్రజలు తమ అవసరాలను వాయిదా వేసుకుంటే ఏడాదికి రూ.30వేల కోట్ల వరకూ విలువైన ఫారెక్ట్స్ కాపాడొచ్చంటూ కొందరు ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు దేశంలోకి విదేశీ కార్ల దిగుమతులను ఆపి దేశీయంగా ఆటో రంగాన్ని బలోపేతం చేస్తే వేల కోట్లు మిగులుతాయ్ కథా అంటున్నారు నెటిజన్లు. 

భారత్ తన విదేశీ మారక ద్రవ్య నిల్వలను ప్రధానంగా ముడి చమురు, ఎలక్ట్రానిక్స్, రక్షణ పరికరాల కోసం వాడుతుంటుంది. అయితే గత కొన్ని ఏళ్లుగా కార్ల దిగుమతి కోసం వెచ్చిస్తున్న ఫారెక్స్ వాటా భారీగా పెరుగుతోంది. గూగుల్ లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. కేవలం 2024లో కార్ల దిగుమతుల కోసమే భారత్ ఏడాదికి సుమారు 2.15 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.18వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఒకవేళ వీటికి వాహన విడిభాగాలు, యాక్సెసరీస్‌ను కూడా కలిపితే.. ఈ మొత్తం 7.78 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.65వేల కోట్లకు చేరింది. మోడీ సర్కార్ దీనిపై ఫోకస్ చేస్తే డాలర్లను ఆదా చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ప్రస్తుత ఏడాదికి వాస్తవ దిగుమతుల లెక్కలు ఇంకా ఎక్కువ లేదా తక్కువ ఉండే అవకాశం ఉంది.

ఎన్ని కార్లు వస్తున్నాయి? వాటి లెక్కలేంటి?
భారత్‌లోకి ప్రధానంగా జర్మనీ, జపాన్, యూకే, అమెరికా నుంచి కార్లు దిగుమతి అవుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో సుమారు 45వేల నుండి 50వేల వరకు ప్రీమియం కార్లు మన దేశంలోకి అడుగుపెట్టాయి. ఇందులో CBU అంటే - పూర్తిగా తయారైనవి, CKD అంటే - విడిభాగాలను తెచ్చి ఇక్కడ అసెంబుల్ చేసేవి ఉన్నాయి. ముఖ్యంగా రోల్స్ రాయిస్, లంబోర్గిని, ఫెరారీ వంటి సూపర్ కార్ల అమ్మకాలు భారత్‌లో ప్రతి ఏటా 15-20% వృద్ధిని నమోదు చేస్తున్నాయి. ధనవంతుల సంఖ్య పెరగడం, అంతర్జాతీయ బ్రాండ్ల పట్ల క్రేజ్ దిగుమతులను పెంచుతోంది.

►ALSO READ | లింక్డ్‌ఇన్ లో లేఆఫ్స్: 900 మందిని ఇళ్లకు పంపిస్తున్న కంపెనీ.. ఎందుకీ నిర్ణయం?

విదేశీ మారక ద్రవ్యం బయటకు వెళ్లకుండా అడ్డుకునేందుకు భారత ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటోంది. విదేశాల నుంచి వచ్చే లగ్జరీ కార్లపై ప్రస్తుతం 110% నుంచి 115% వరకు కస్టమ్స్ డ్యూటీ విధిస్తున్నారు. అంటే విదేశాల్లో రూ.కోటి విలువ చేసే కారును భారత్‌లో కొనాలంటే పన్నులతో కలిపి సుమారు రూ.2కోట్ల 20లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. అయినప్పటికీ దిగుమతులు ఏమాత్రం తగ్గకపోవటం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అయితే ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో అధికంగా సుంకాలు వేయటం కన్నా దిగుమతులను ఏడాది పాటు నిలిపేయటమే మంచిదిగా అంటున్నారు సామాన్య ప్రజలు.

విదేశీ కార్ల దిగుమతి అనేది కేవలం ఒక విలాసం మాత్రమే కాదు.. అది దేశ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా ఫారెక్స్ రిజర్వ్స్ పై ప్రభావం చూపే అంశం. ఈ ఏరియాలో కేంద్రం తన ఫోకస్ పెడితే భారీగానే డాలర్ల వృధాను అడ్డుకోవచ్చని తెలుస్తోంది.