- కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్‌రోహిత్‌రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్‌పార్టీ కేసు మరువక ముందే చెక్‌బౌన్స్ కేసులో దోషిగా తేలారు. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్‌జారీ అయింది. కోర్టులో హాజరైన తర్వాత న్యాయస్థానం శిక్షను విధిస్తూ తన తీర్పు వెల్లడించనుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యవహారంలో ఇంటెల్లిడెక్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కి చెందిన పిన్నప్పరెడ్డి జయ ఆదిత్య రెడ్డికి రోహిత్ రెడ్డి ఇచ్చిన రూ.34.23 లక్షలు విలువ చేసే చెక్ గతంలో బౌన్స్ అయ్యింది.
దీంతో జయ ఆదిత్యరెడ్డి 2021 లో నాంపల్లి మొదటి మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో చెక్‌బౌన్స్ (సెక్షన్138 ఆఫ్ ఎన్‌ఐ) యాక్ట్ కింద పిటిషన్ దాఖలు చేశారు. విచారణ సందర్భంగా కోర్టు పూర్తి ఆధారాలు పరిశీలించింది. బ్యాంక్ అకౌంట్‌లో సరైన బ్యాలెన్స్ లేక పోయినా రూ.34.23 లక్షల చెక్ ఇచ్చినట్టు గుర్తించింది. ఈ మేరకు చెక్‌బౌన్స్ సెక్షన్ కింద రోహిత్ రెడ్డిని దోషిగా నిర్ధారించింది. శుక్రవారం తన తీర్పు ప్రకటించింది. కాగా, రోహిత్‌రెడ్డి విచారణకు హాజరుకాలేదు. దీంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. రోహిత్ రెడ్డి విచారణకు హాజరైన తర్వాత లేదా పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన తర్వాత శిక్ష ఖరారు చేయనున్నారు.
