బుద్ధి మారని మాజీ కానిస్టేబుల్.. మూడోసారి భారీగా గంజాయితో దొరికిండు

బుద్ధి మారని మాజీ కానిస్టేబుల్.. మూడోసారి భారీగా గంజాయితో దొరికిండు

జూబ్లీహిల్స్, ఎస్సార్ నగర్ పోలీసులు ,టాస్క్ ఫోర్స్ సంయుక్తంగా నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. ఏకంగా 158 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ఓ మాజీ సీఐఎస్‌ఎఫ్ (CISF) కానిస్టేబుల్‌  పోలీసులకు అడ్డంగా దొరికారు. 

టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ రఘునాథ్ వివరా లప్రకారం. పోలీసుల చేతికి చిక్కిన ఈ నిందితుడి పేరు శివకృష్ణ. గతంలో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేసిన ఇతడు.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆర్థిక ఇబ్బందుల వంకతో గంజాయి అక్రమ రవాణాను లాభసాటి వ్యాపారంగా మార్చుకున్నాడు. ఇతని ట్రాక్ రికార్డ్ చూస్తే పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. శివకృష్ణ గంజాయి రవాణా చేస్తూ పోలీసులకు దొరికిపోవడం ఇది మొదటిసారేం కాదు.. గతంలో కూడా రెండుసార్లు గంజాయితో పట్టుబడి సస్పెండ్ అయ్యాడు.

జైలుకు వెళ్లి వచ్చినా శివకృష్ణలో ఎలాంటి మార్పు రాలేదు. మూడోసారి కూడా భారీ స్కెచ్‌తో 158 కేజీల గంజాయిని నగరంలోకి సరఫరా చేస్తుండగా.. వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ నిఘాతో దొరికిపోయాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాపై తాము అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నామని.. నగరంలో డ్రగ్స్ ముఠాల ఆట సాగనిచ్చేదే లేదని డీసీపీ వైభవ్ రఘునాథ్హెచ్చరించారు.