మీ అభిమానానికి కండ్లు చెమ్మగిల్లుతున్నయ్​.. సీఎం రేవంత్​రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ

మీ అభిమానానికి కండ్లు చెమ్మగిల్లుతున్నయ్​.. సీఎం రేవంత్​రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ
  •  పది జన్మలకు సరిపడా కష్టాలు అనుభవించిన 
  • మీ అభిమానానికి కండ్లు చెమ్మగిల్లుతున్నయ్​
  • సీఎం రేవంత్​రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని లేఖ
  • తనకు ఉద్యోగం వద్దని.. వేద, యజ్ఞ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు సహకరించాలని వినతి
  • బ్యూరోక్రసీపై నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికే జీవితం అంకితమని ప్రకటన

హైదరాబాద్​, వెలుగు:  సీఎం రేవంత్​రెడ్డి చూపిస్తున్న అభిమానానికి తన కండ్లు చెమ్మగిల్లుతున్నాయని, వారి ఆత్మీయత తన హృదయానికి గొప్ప సాంత్వన కలిగించిందని మాజీ డీఎస్పీ నళిని అన్నారు. తనకు ఉద్యోగం ఇవ్వాలనుకోవడం చాలా సంతోషమని.. కానీ, దానికి బదులుగా తాను చేస్తున్న ధర్మ ప్రచారానికి ఏదైనా ఇతర సాయం చేస్తే బాగుంటుందని ఆమె కోరారు. ఈ మేరకు ఆదివారం నళిని తన ఫేస్​బుక్​లో సీఎం రేవంత్​కు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు తన డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసిన నళినిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకోలేదని, ఆమె కోరుకుంటే తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఇవ్వాలని అధికారులను ఇటీవల సీఎం రేవంత్​ ఆదేశించారు. దీనికి నళిని స్పందిస్తూ లేఖను పోస్టు చేశారు. తన పేరును నళినీ ఆచార్యగా, తనను యజ్ఞ బ్రహ్మ,వేద ప్రచారకురాలిగా అందులో ఆమె పేర్కొన్నారు. పదేండ్లు జీవచ్ఛవంలా బతికానని, రెండేండ్ల నుంచి సనాతన ధర్మ ప్రచారంలో కొత్త జీవితాన్ని ప్రారంభించానని తెలిపారు. బ్యూరోక్రసీపై తనకు నమ్మకం పోయిందని, సనాతన ధర్మ ప్రచారానికే జీవితాన్ని అంకితం చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. 

తెలంగాణ ఉద్యమంలో తాను నిర్వహించిన కీలకపాత్ర తనను ప్రజలకు దగ్గర చేసినా.. బంధు మిత్ర పరివారం మాత్రం వెలివేశారని ఆమె అన్నారు. దాదాపు పదేండ్లు నరకం అనుభవించానని.. ఇల్లు, కుటుంబం, ఆరోగ్యం, మనశ్శాంతి అన్నింటినీ కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్నేండ్లు ఓ జీవచ్ఛవంలా బతికానని అన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ మూలాలు కలిగిన సీఎంగా తన పోరాటం, సంఘర్షణను జనానికి తెలియజెప్పాలనే సందర్భాన్ని తీసుకొచ్చినందుకు సంతోషమని, అందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని పేర్కొన్నారు. ‘‘నాకు ఏదైనా న్యాయం చేయాలనుకుంటే ఉద్యోగం కాకుండా వేరే ఇతర సాయం చేయండి. ప్రభుత్వం తరఫున ఇచ్చే ఫండ్​ను స్వతంత్రంగా ఉంటూనే ఒక వేద, యజ్ఞ, సంస్కృత సంబంధ ధార్మిక కేంద్ర ఏర్పాటుకు వినియోగిస్త” అని ఆమె తెలిపారు. 

క్షణమొక గండం

తన గతమంత ఒక రీల్​లా కండ్ల ముందే కదులుతున్నదని నళిని పేర్కొన్నారు. ‘‘ఒక సస్పెండెడ్​ ఆఫీసర్​గా ఇన్నేండ్లూ ఓ సోషల్​ స్టిగ్మాను మోశాను. ఆ నాటి ప్రభుత్వం అప్పుడు నన్ను మూడేండ్లు తీవ్ర ఇబ్బందులు పెట్టింది. ఒక్క మాటలో చెప్పాలంటే క్షణమొక గండంలా గడిచింది. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు.. 2009 డిసెంబర్​ 9న నేను చేసిన రాజీనామా సంచలనం సృష్టించింది. అదే రాత్రి నాటి కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన ఉద్యమాన్ని చప్పున చల్లార్చింది. అప్పటి సీఎం రోశయ్య మహిళా దినోత్సవాన నాకు నా ఉద్యోగాన్ని కానుకగా తిరిగిస్తున్నట్టు ప్రకటిస్తే.. రాజీనామాను ఉపసంహరించుకని ఉద్యోగంలో చేరాను. నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే. పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు 18 నెలలపాటు నేను ఎదుర్కొన్న ఒత్తిడి, అవమానాలు నాకు బ్యురోక్రసిపైనే నమ్మకం పోయేలా చేశాయి. విమెన్​ ప్రొటెక్షన్​ సెల్​లో పోస్టింగ్​ ఇచ్చి.. ఎన్నెన్నో చార్జ్​ మెమోలు ఇచ్చారు. వివరణలు ఇవ్వాలనడం, వార్షిక రిపోర్ట్స్​లో నాపై చెడు రిమార్కులు రాయడం, బ్యాచ్​లో నా ఒక్కదానికే ప్రమోషన్లను ఆపేయడం, ప్రొబేషన్​ పీరియడ్​ను పొడిగించడం వంటివి నన్ను ఒంటరిని చేశాయి. 

కానిస్టేబుల్​ కన్నా హీనంగా చూశారు’’ అని ఆ నాటి రోజులను ఆమె గుర్తుచేసుకొని ఆవేదన వెలిబుచ్చారు. తనకు ఎదురైన అనుభవాలు, అవమానాలను రోశయ్య తర్వాత సీఎం అయిన కిరణ్​ కుమార్​రెడ్డికి మొరపెట్టుకున్నానని నళిని తెలిపారు.  ‘‘ఉమ్మడి రాష్ట్రంలో కనీసం ఆయన అపాయింట్​మెంట్​ కూడా దొరకలేదు. ఉద్యమనాయకులను కొందరిని కలిస్తే వాళ్లు సాయం చేయకపోగా.. నన్నే రివర్స్​లో ఎగతాళి చేశారు. తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్​కు, సోనియా గాంధీకి లేఖలు రాసి నా పరిస్థితిని, రాష్ట్ర దుస్థితినీ వివరించాను. ప్రత్యక్ష ఉద్యమంలో నేను మళ్లీ పాల్గొనడం అనివార్యం అనిపించింది. అందుకే 2011 నవంబర్​ 1న అప్పటి డీజీపీకి నా రాజీనామా ఇచ్చేసి ప్రజల్లోకి వెళ్లాను. శ్రీకృష్ణ కమిటీ పేరిట జరుగుతున్న జాప్యాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమ కార్యాచరణను ప్రకటించాను. ప్రభుత్వం వెంటనే నన్ను సస్పెండ్​ చేసింది. దేశ ద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు చేసింది. అన్ని పత్రికల్లో నా ఫొటోలు వేసి ఆ వార్తను పెద్దగా రాసి హైలైట్ చేశారు. ఆ నాడే  నాకు డిపార్ట్మెంట్ పట్ల ఏహ్య భావం కలిగింది. నాలోని ఒక డైనమిక్​ కమిటెడ్​ ఆఫీసర్​ను ఆరోజే హత్య చేశారు. ఆరోజే నల్గొండ సభకు సుష్మా స్వరాజ్​ వచ్చారు. నన్ను అర్థం చేసుకొని అక్కున చేర్చుకున్నారు. దీంతో నాకు కొంత స్వాంతన చేకూరింది’’ అని ఆమె పేర్కొన్నారు. 

‘వేదం యజ్ఞం’ పుస్తక ప్రింటింగ్​ పూర్తికాగానే మిమ్మల్ని కలుస్తాను

తన ప్రస్థానం (డీఎస్పీ నుంచి డీఎన్​ఏగా మారడం) సంఘర్షణమయమని, వేదనాభరితమని నళిని అన్నారు. తననెవరూ ఇప్పుడున్న సనాతన ధర్మ ప్రచార ఉద్యోగం నుంచి సస్పెండ్​ చేయలేరని, ఉద్యోగానికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఇంకెన్నడూ కలగవని పేర్కొన్నారు. కాబట్టి దయచేసి తన విషయంలో స్టేటస్​ కోకు అనుమతివ్వాలని సీఎం రేవంత్​ను ఆమె కోరారు. డిపార్ట్​మెంట్​లో తనలాగా ఇంకే అధికారి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ‘‘మీలో మంచి స్పార్క్​ ఉంది. మీ నుంచి చక్కని పాలనను ఆశించవచ్చు అనిపిస్తున్నది. నాకు మిమ్మల్ని ఓసారి కలవాలని ఉన్నా.. సనాతన ధర్మానికి మూలమైన ‘వేదం యజ్ఞం’ అనే పుస్తకాన్ని తెలుగు, హిందీ భాషల్లో రాస్తున్నాను. మహర్షి 200వ జయంతి వరకు దాన్ని సిద్ధం చేయాల్సి ఉన్నది. ఆ పుస్తకం ప్రింటింగ్​ అయిపోగానే మిమ్మల్ని కలుస్తాను.  ఈలోగా మీడియా మిత్రులు నా ప్రతిస్పందన తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇలా నా ఫేస్​బుక్​లో బహిరంగ లేఖ రాయాల్సి వస్తున్నది’’ అని నళిని పేర్కొన్నారు. 

గన్​ స్థానంలో వేదం

‘‘రెండేండ్ల కింద దేవుడి దయతో నా జీవితంలోకి మహర్షి దయానంద సరస్వతి ప్రవేశించారు. వేదమాత, యజ్ఞ దేవతలు తిరిగి నాలో జీవం పోశారు. అందుకే నా జీవితాన్ని ఆ మహనీయుని చరణాలకే అంకితమిచ్చాను. జీవితంలో నేను పది జన్మలకు సరిపడా కష్టాలు పడ్డాను. అది చాలు. ఇంకా నేను ఎవరి కోసమూ ఇంకెలాంటి త్యాగమూ చేయలేను. జన్మ రాహిత్యం కోసం అష్టాంగ యోగ మార్గంలో నడుస్తున్నాను. వేద ప్రచారకురాలిగా, వైదిక యజ్ఞ బ్రహ్మగా సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడమే నా ముందున్న కర్తవ్యం. దీని వల్ల నా ఆత్మ ఉన్నతితో పాటు సమాజ ఉన్నతికి పాటు పడొచ్చు. కాబట్టి ఇప్పటి నా పంథాను మార్చుకోలేను. మీరు భావిస్తున్నట్లు పోలీస్​ కాకుండా వేరే ఉద్యోగం కూడా  నేను చేయలేను. ఎందుకంటే నా అమూల్య సమయాన్ని బ్యూరోక్రసీకి వెచ్చించలేను. అన్ని దానాల్లో గొప్పదైన విద్యా దానాన్ని చేస్తూ.. పుణ్యం మూటకట్టుకోవాలనే కోరిక తప్ప నాకు ఇంకేమీ లేదు. పరమేశ్వ రుడు నన్ను క్రిమినాలజీ నుంచి ఫిలాసఫీ వైపు నడిపించాడు. గన్​ స్థానంలో నాచేత వేదం పట్టించాడు. నాగొంతులో మాధుర్యం నింపి ఆచార్యను చేశాడు. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని నా జీవితంలో రుజువైంది’’ అని లేఖలో నళిని పేర్కొన్నారు.