- సీపీఐ నేతలతో దేవ్‌జీ, రాజిరెడ్డి, చంద్రన్న భేటీ
హైదరాబాద్, వెలుగు: అటవీబాట వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టులు తమ పార్టీలో చేరాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఆహ్వానించారు. మాజీ మావోయిస్టులు దేవ్‌జీ(తిప్పిరి తిరుపతి), మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), పుల్లూరి ప్రసాద్ రావు (చంద్రన్న)లు శనివారం హైదరాబాద్హిమాయత్నగర్ లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మఖ్దూం భవన్ లో సీపీఐ రాష్ట్ర నాయకులను మార్యద పూర్వకంగా కలిశారు. తమ కార్యాలయానికి వచ్చిన ముగ్గురికి సీపీఐ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది.
ప్రస్తుతం తమ మధ్య మర్యాదపూర్వక సమావేశం జరిగిందని మాజీ మావోయిస్టులు తెలిపారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కగార్ అపరేషన్‌కు వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎం, తదితర వామపక్షపార్టీలతోపాటు ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్య శక్తులు, మేధావులు అనేకమంది వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేశారన్నారు. ఎన్‌కౌంటర్ పేరుతో ఏమి చేస్తారో తెలియని భయానక పరిస్థితుల్లో పాత్రికేయులు సహా అందరూ ఆందోళనకు గురయ్యారని వాపోయారు.
దేశంలో పెరుగుతున్న మతోన్మాద, ఫాసిస్ట్ శక్తులను ఎదుర్కోవాలంటే కమ్యూనిస్టు శక్తులన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలో అందరూ కలిసి మరోసారి సమావేశమై తమ రాజకీయ అభిప్రాయాలను స్పష్టంగా వెల్లడిస్తారని కూనంనేని పేర్కొన్నారు.
