మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే పాషా ఖాద్రీ కన్నుమూత
  • మూడు సార్లు చార్మినార్,ఒకసారి యాకత్​పుర నుంచి ఎన్నిక
  • 2023 నుంచి ఎంఐఎం జనరల్​ సెక్రటరీగా కొనసాగుతున్న ఖాద్రీ  

హైదరాబాద్, వెలుగు: మాజీ ఎమ్మెల్యే, మజ్లిస్​ పార్టీ జనరల్ సెక్రటరీ సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ(72) అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత సలాహుద్దీన్ ఓవైసీకి సన్నిహితుడుగా గుర్తింపు పొందిన ఖాద్రీ.., మజ్లిస్​ పార్టీలో కీలక  నేతగా ఎదిగారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో పార్టీ  నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బలోపేతం చేయడంలో ఆయనది ముఖ్యపాత్ర. 2004, 2009, 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చార్మినార్, యాకత్​పుర అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2023 వరకు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు.

అంతకు ముందు 1986 నుంచి 1991 వరకు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్​)లో కార్పొరేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేశారు. గత 2008 నుంచి మజ్లిస్​ పార్టీ జనరల్ సెక్రటరీగా సంస్థాగత బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మజ్లీస్​ పార్టీకి, ఓల్డ్​ సిటీకీ ఆయన సుదీర్ఘకాలంగా సేవలు అందించారు. ప్రజాకర్షణగల రాజకీయ నేతగా ఆయన పేరు సంపాదించారు. పాషా ఖాద్రీ రెండేండ్లుగా కిడ్నీ సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు.

గత ఏడాది నవంబర్ 30న ఖాద్రీ ఆరోగ్యం క్షీణించడంతో సంతోష్​నగర్​లోని ఓవైసీ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చేరి చికిత్స పొందారు. ఖాద్రీ పరిస్థితి విషమంగా ఉండడంతో ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఈ క్రమంలోనే మంగళవారం పాషా ఖాద్రీ మృతి చెందారు. ఆయన మృతికి మజ్లిస్​ పార్టీ అధినేత అసదుద్దీన్​ ఓవైసీ, శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్​ ఓవైసీ, ఆపార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.