ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు

ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడి రిమాండ్ పొడిగింపు

ఈఎస్ఐ స్కామ్‌కు సంబంధించిన కేసులో టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు జుడిషియ‌ల్ రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్టు. గ‌తంలో ఆయ‌న‌కు విధించిన 14 రోజుల రిమాండ్ శ‌నివారానికి ముగిసింది. దీంతో మ‌రోసారి జూలై 10 వ‌ర‌కు రిమాండ్‌ను పొడిగిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గత ప్ర‌భుత్వంలో అచ్చెన్నాయుడు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో అక్రమాలు ఈఎస్ఐ హాస్పిట‌ళ్ల‌కు సంబంధించిన మందుల కొనుగోలు, టెలీ మెడిసిన్ చెల్లింపుల వ్య‌వ‌హారంలో వంద‌ల కోట్ల అవినీతి జ‌రిగిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై విజిలెన్స్ నివేదిక ఆధారంగా ద‌ర్యాప్తు చేసిన ఏసీబీకి అవినీతి జ‌రిగినట్లు ప్రాథ‌మిక ఆధారాలు ల‌భించ‌డంతో మాజీ మంత్రి అచ్చెన్నాయుడితో పాటు నాడు ఈఎస్ఐలో కీల‌క ప‌ద‌వుల్లో ఉన్న ప‌లువురు అధికారుల‌ను అరెస్టు చేసింది. అయితే అచ్చెన్నాయుడిని అరెస్టు చేసే రెండ్రోజుల ముందే ఆయ‌న పైల్స్ ఆప‌రేష‌న్ చేయించుకుని ఉండ‌డంతో, శ్రీకాకుళం నుంచి విజ‌య‌వాడ వ‌రకూ కారులో ప్ర‌యాణం చేయించ‌డంపై ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సుదీర్ఘ ప్ర‌యాణంతో గాయం తిరగబెట్టడంతో ఆయనను గుంటూరు జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతున్న ఆయ‌న్ని ఏసీబీ అధికారులు మూడు రోజుల పాటు రిమాండ్‌కు తీసుకుని అక్క‌డే విచారించారు. వారి విచార‌ణ కూడా శ‌నివారంతో ముగిసింది.