పీసీసీ ప్రెసిడెంట్..లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వాలి:కొండా సురేఖ

పీసీసీ ప్రెసిడెంట్..లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వాలి:కొండా సురేఖ

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి కొండా సురేఖ దిగ్విజయ్ సింగ్కు లేఖ రాశారు. తనకు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా ఏఐసీసీ సెక్రటరీ పదవి ఇవ్వాలని కోరారు. తనను పిఇసి సభ్యునిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు. అయితే 27 ఏళ్ల  రాజకీయ అనుభవం కలిగిన తనను ఏఐసీసీ కార్యదర్శిగా లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించాలని కోరారు. ఈ విషయాన్ని ఇప్పటికే  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా అడిగినట్లు లేఖలో పేర్కొన్నారు. 

రాజకీయాల్లో తనకు దాదాపు 3 దశాబ్దాల అనుభవం ఉందని దిగ్విజయ్ సింగ్కు రాసిన లేఖలో కొండా సురేఖ ప్రస్తావించారు. మహిళా సాధికారత సాధించేందుకు తనకు అన్ని నైపుణ్యాలు ఉన్నాయన్నారు. టీపీసీసీలోని మహిళలు దేశంలో ప్రత్యేకంగా ఉండేలా చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో తాను చేసిన సేవ, వారితో కలిగిన సంబంధాలు, నెట్‌వర్కింగ్ సామర్థ్యంతో ఏఐసీసీ సెక్రటరీ లేదా పీసీసీ ప్రెసిడెంట్ పోస్ట్‌లకు తాను అర్హురాలినని బలంగా నమ్ముతున్నానని చెప్పారు. ఈ పదవుల్లో ఏది ఇచ్చినా..వంద శాతం వాటికి న్యాయం చేస్తానని వాగ్దానం చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతీ కార్యకర్త.. కాంగ్రెస్ పనితీరు పట్ల సంతోషంగా, సంతృప్తిగా ఉండేలా చూస్తానని భరోసా ఇచ్చారు. 

తాను 1995 నుంచి రాజకీయాల్లో ఉన్నానని..27 ఏళ్ల రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశానని లేఖలో పేర్కొన్నారు. తన భర్త కొండా మురళీధర్ రావు రెండు సార్లు ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు గుర్తు చేశారు. తామిద్దరం వెనుబడిన తరగతుల నుంచి వచ్చి..తెలంగాణతో పాటు..ఏపీ రాజకీయాల్లో మంచి పేరు సంపాదించుకున్నామన్నారు. కేసీఆర్ మందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోందని..తనకు  ఏఐసీసీ కార్యదర్శి లేదా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా  అవకాశం ఇస్తే..తన నైపుణ్యంతో కాంగ్రెస్ సీట్ల సంఖ్య పెరిగేలా కృషి చేస్తానని లేఖలో కొండా సురేఖ పేర్కొన్నారు.