మాజీ సర్పంచుల అరెస్ట్...పెండింగ్ బిల్లుల కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం

మాజీ సర్పంచుల అరెస్ట్...పెండింగ్ బిల్లుల కోసం సీఎం క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నం
  •     రూ.531 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లుల కోసం రాష్ట్రవ్యాప్తంగా మాజీ సర్పంచులు పోరుబాట పట్టారు. 2019 నుంచి 2024 వరకు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి రావాల్సిన రూ.531 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మాజీ సర్పంచుల సంఘం (జేఏసీ) ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ ముట్టడికి యత్నించారు. ర్యాలీగా వెళ్తున్న మాజీ సర్పంచులను పోలీసులు అడ్డుకోవడంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు వారిని అరెస్ట్ చేసి మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

ఈ సందర్భంగా మాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు  సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ.. గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అప్పులు తెచ్చి పనులు చేసిన సర్పంచుల పరిస్థితి వర్ణనాతీతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని ఏడాదిన్నరగా అడుగుతున్నా.. ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. వందల కోట్ల బకాయిలు ఉంటే.. కేవలం 153 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటారా?అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అమనాపూర్ గ్రామానికి చెందిన కృష్ణ అనే సర్పంచ్, పెండింగ్ బిల్లులు రాక అప్పుల బాధతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.