వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాజీ బిజినెస్ పార్టనర్, ఇండియన్ సంతతికి చెందిన హోటళ్ల యజమాని దినేశ్ చావ్లా దొంగతనం కేసులో పట్టుబడ్డారు. అమెరికాలోని మెంఫిస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో పాసింజర్ల లగేజీలను దొంగిలిస్తూ సీసీ కెమెరాలకు చిక్కారు. దొంగిలించిన సూట్‌కేసు తన కార్లో పెట్టుకుని మరో ఫ్లయిట్ ఎక్కుతుండగా చావ్లాను పట్టుకున్నట్టు పోలీసులు చెప్పారు. చావ్లా హోటల్స్‌కు దినేశ్ చావ్లా సీఈవోగా ఉన్నారు. ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్‌కు ఆయన బిజినెస్ పార్టనర్‌గా ఉండేవారు.
చావ్లా కారును తనిఖీ చేసిన పోలీసులు అందులో ఓ సూట్‌కేస్‌తో పాటు నెల రోజుల కిందట ఎయిర్‌పోర్ట్‌లో కొట్టేసిన మరో లగేజ్‌ను కూడా గుర్తించినట్టు న్యూయార్క్ టైమ్స్ పేపర్ ఓ వార్తను పబ్లిష్ చేసింది. రెండు బ్యాగుల్ని దొంగిలించినట్టు చావ్లా అంగీకరించారని పోలీసులు చెప్పారు. ఆయన చోరీచేసిన వస్తువుల విలువ నాలుగు వేల డాలర్లు ఉంటుందని గుర్తించారు. ఎంతోకాలంగా తాను ఇలాంటి దొంగతనాలు చేస్తున్నానని చావ్లా ఒప్పుకున్నట్టు పోలీసులు చెప్పారు. ఇంతకుముందు చేసిన దొంగతనాల వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. లగేజీ దొంగతనం చేయడం తప్పు అని తనకు తెలిసినా ‘‘థ్రిల్లింగ్’’ కోసమే ఇలా చేశానని చావ్లా చెప్పినట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. దినేశ్ చావ్లా ఆయన తమ్ముడు సురేశ్ చావ్లా అమెరికాలోని డెల్టాలో హోటల్స్, మోటల్స్ నడుపుతున్నారు. క్లెవెల్యాండ్‌లో లగ్జరీ హోటల్ కడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ట్రంప్ ఆర్గనైజేషన్‌తో కలిసి దినేశ్ చావ్లా జాయింట్ వెంచర్‌గా ఈ ప్రాజెక్టులు చేపట్టారు.
