- ఆర్థిక, న్యాయ శాఖల ఆమోదం, కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఏకపక్ష నిర్ణయం
- దీనివల్ల ప్రభుత్వంపై సుమారు రూ. 600 కోట్ల ఆర్థిక భారం
- ఆయన నమ్మకద్రోహం వల్ల హెచ్‌ఎండీఏకు రూ.75.88 కోట్ల నష్టం
- ప్రతిఫలంగా బీఆర్ఎస్కు రూ. 44 కోట్ల భారీ విరాళాలు.. ఇది క్విడ్‌ప్రో కోనే
- 77 పేజీల చార్జ్‌షీట్‌లో కేటీఆర్ సహా ఐదుగురిపై ఏసీబీ అభియోగాలు
- పక్కా ఆధారాలు.. సాక్షులుగా 14 మంది..నేడు నాంపల్లి ఏసీబీ కోర్టులో విచారణ
హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్టు ఏసీబీ తేల్చింది. ఆర్థిక, న్యాయ శాఖల ఆమోదం, కేబినెట్అప్రూవల్ లేకుండానే ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాల వల్ల హెచ్‌ఎండీఏకు చెందిన రూ.55 కోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ప్రభుత్వంపై రూ.600 కోట్ల ఆర్థిక భారం పడిందని బయటపెట్టింది. ఈవెంట్ల నిర్వహణతో హెచ్‌ఎండీఏకు ఎలాంటి లాభం లేకపోగా ఉల్టా రూ. 75.88 కోట్ల నష్టం వాటిల్లినట్టు పేర్కొంది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏస్ నెక్ట్స్‌జెన్‌కు లబ్ధి చేకూర్చినందుకు ప్రతిఫలంగా దాని అనుబంధ సంస్థ గ్రీన్‌కో.. బీఆర్ఎస్ పార్టీకి రూ. 44 కోట్లను ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ముట్టజెప్పిందని, ఇది ముమ్మాటికీ క్విడ్‌ప్రోకోనే అని ఏసీబీ వెల్లడించింది. ఈ మేరకు 77 పేజీల చార్జిషీట్‌లో కేటీఆర్ సహా మాజీ ఐఏఎస్ అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డితో పాటు ఏస్ నెక్ట్స్ జెన్, ఫార్ములా ఈ రేస్ సంస్థ కుట్ర కోణాన్ని ఆధారాలతో సహా కోర్టుకు అందించింది. ఇందుకు 14 మందిని సాక్షులుగా చూపింది. కాగా, శుక్రవారం నాంపల్లి ఏసీబీ కోర్టులో జరిగే విచారణకు నిందితులు హాజరుకానుండడంతో ఈ కేసుపై ఆసక్తి నెలకొన్నది.
అంతా కేటీఆర్ ఏకపక్ష నిర్ణయం..
ఏసీబీ చార్జిషీట్‌లో వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు నిర్వహించాలన్న ప్రతిపాదనేదీ ప్రభుత్వవర్గాల నుంచి రాలేదు. 2021 నవంబర్‌లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కన్సల్టెంట్ గువ్వాడ కిరణ్ మల్లీశ్వర్ రావు సహా పలువురు ప్రైవేట్ వ్యక్తుల మధ్య చర్చతో ఈ మొత్తం వ్యవహారానికి తెరలేచింది.
ఇదే విషయమై 2021 నవంబరు 18వ తేదీన టీహబ్‌లో ఇచ్చిన ప్రజంటేషన్‌లో ఆర్థిక, వ్యాపారపరమైన సహకారం కోసం గువ్వాడ కృష్ణారావు.. గ్రీన్‌కో వ్యవస్థాపకుడు చెలమలశెట్టి సునీల్‌ను సంప్రదించారు. ఆ తర్వాత సునీల్‌తో జరిగిన సమావేశానికి నాటి మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. సునీల్‌తో భేటీ అనంతరం అధికారికంగా ఎవరిని సంప్రదించకుండానే కేటీఆర్ స్వయంగా, ఏకపక్షంగా ఫార్ములా ఈ రేసు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడే అక్రమాలకు బీజం పడింది. కేటీఆర్‌కు రాజకీయపరంగా రక్షణ కల్పించడంతోపాటు ఐఏఎస్ అర్వింద్‌కుమార్ తన అధికార హోదా దుర్వినియోగం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా ఉన్న కేటీఆర్ ఆదేశాల ప్రకారమే అర్వింద్ కుమార్ నడుచుకున్నారు.
నిబంధనలన్నింటినీ తుంగలో తొక్కి రేసు నిర్వహణకు ఒప్పందం కుదుర్చున్నారు. కేటీఆర్ సొంత నిర్ణయంతో 2022 జనవరి 17న ఫార్ములా ఈ ఆపరేషన్స్ తరఫున అల్బెర్టో లాంగోతో పాటు ఐఏఎస్ అర్వింద్‌కుమార్, సునీల్ లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేశారు. ఈ లెటర్‌పై సంతకం చేసేందుకు అర్వింద్‌కుమార్‌కు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవు. ఈ రేసు నిర్వ హణ కోసం సునీల్ ‘ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేయగా.. ఇతరత్రా వ్యవహారాలు చూసే బాధ్యత కృష్ణారావు చేపట్టారు. ఇందుకుగాను కృష్ణారావు ఏస్ సంస్థ నుంచి ఏడాదికి రూ.1.9 కోట్ల వేతనం తీసుకునేందుకు ఒప్పందం చేసుకున్నారు.
కేటీఆర్ ఆదేశాలు.. అర్వింద్ కుమార్ సంతకాలు..
2023 ఫిబ్రవరిలో జరిగిన మొదటి రేసు ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు రూ.175 కోట్ల భారీ నష్టం తెచ్చిపెట్టింది. ఆర్థికంగా మద్దతుగా ఉంటామని చెప్పిన ప్రభుత్వంగానీ, రేసు నిర్వహించిన ఎస్ఈవో గానీ పట్టించుకోకపోవడంతో ఏస్ సంస్థ సీజన్-10 స్పాన్సర్‌గా తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. సీజన్-10 కోసం 2023 మే నాటికి కొంత ఫీజు చెల్లించాల్సి ఉండగా గడువు ముగిసిపోవడంతో జూన్ నాటికి రేసు నిర్వహణ జాబితా నుంచి హైదరాబాద్ పేరు తొలగించారు. దీంతో అర్వింద్‌కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్‌ఎన్ రెడ్డితో కలిసి సీజన్-10 నిర్వహణ బాధ్యతతోపాటు ప్రమోటర్ ప్రభుత్వం ఉండేలా 2023 సెప్టెంబరు 27న హడావుడిగా నోట్‌ఫైల్ సిద్ధం చేశారు. దీన్ని కేటీఆర్ ఆమోదించారు. ఫీజుల కోసం రూ.110 కోట్లు, పనులకు అదనంగా మరో రూ.50 కోట్లు.. మొత్తం రూ.160 కోట్లను తక్షణం విడుదల చేస్తూ అర్వింద్‌కుమార్ పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన నోట్‌ఫైల్ అనుమతి కోసం పురపాలక శాఖకుగానీ, ఇటు ఆర్థిక, న్యాయశాఖలకు గానీ పంపకపోవడమే కాదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మంత్రివర్గానికి కూడా పంపలేదు.
కీలకంగా వ్యవహరించిన కేటీఆర్..
ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ కార్ రేస్‌ను నిర్వహించాలని తీసుకున్న వ్యక్తిగత నిర్ణయంతోపాటు అనధికారిక లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకాలు చేయడంలో కేటీఆర్ కీలకంగా వ్యవహరించారు. ఇదంతా తెలంగాణ సెక్రటేరియెట్ బిజినెస్ రూల్స్ ఉల్లంఘన కిందికే వస్తుంది. ఏస్ నెక్ట్స్ జెన్ ప్రమోటర్ ఎదుర్కొన్న నష్టాల గురించి తెలిసినప్పటికీ.. కేటీఆర్ తన వ్యక్తిగత ప్రయోజనం కోసమే వ్యవహరించారు. హెచ్‌ఎండీఏ ద్వారా సీజన్ 10, 11,12 నిర్వహించేందుకు ప్రభుత్వాన్ని ప్రమోటర్‌గా వ్యవహరించేలా కేటీఆర్, అర్వింద్‌కుమార్ కలిసి నిర్ణయం తీసుకున్నారు. సరైన అనుమతి లేకుండా అర్వింద్‌కుమార్ ఒప్పందాలపై పదేపదే సంతకాలు చేసేలా కేటీఆర్ ఆదేశాలు ఇచ్చారు. చట్టపరమైన బాధ్యత, ఆర్థిక నిబంధనలు పాటించాల్సిన అవసరం లేకుండానే హెచ్‌ఎండీఏ నిధులను విడుదల చేయాలని కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందుకుగాను కింది స్థాయి అధికారులపై ఐఏఎస్ అర్వింద్‌కుమార్ ఒత్తిడి తీసుకువచ్చారు.
బీఎల్ఎన్రెడ్డికి ఎక్స్‌టెన్షన్ ఆశచూపి..
కేటీఆర్, అర్విందకుమార్ ఆదేశాల మేరకు అనధికారిక వ్యయాల కోసం హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి చెల్లింపు ఉత్తర్వులను జారీ చేశారు. దీనికి ప్రతిఫలంగా తన ఉద్యోగ కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇలా కేటీఆర్, అర్వింద్‌కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి పథకం ప్రకారమే ఆర్థిక ఇబ్బందులను ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టడంతోపాటు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనలు ఉల్లంఘించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వమే స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని అల్బెర్టో లాంగోకు అర్వింద్‌కుమార్ హామీ ఇచ్చారు.
ఇలా అనధికార నిర్ణయాల వల్ల ప్రభుత్వానికి రూ.160 కోట్ల నష్టం వాటిల్లింది. కేటీఆర్, అర్వింద్ కుమార్ నిబంధనలకు విరుద్ధంగా మూడు సీజన్లకు రూ.600 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని దాచిపెట్టి ఒక సీజనుగా మాత్రమే చూపించారు. ఇందుకోసం రాజకీయంగా అత్యున్నత స్థానంలో ఉన్న కేటీఆర్ నిబంధనలన్నీ తుంగలో తొక్కారు. ఆయన ఆదేశాల మేరకు అర్వింద్‌కుమార్ నడుచుకున్నారని ఏసీబీ తన చార్జిషీట్‌లో పేర్కొన్నట్టు తెలిసింది.
