కొత్త టీచర్లకు ఫౌండేషన్ ట్రైనింగ్

కొత్త టీచర్లకు ఫౌండేషన్ ట్రైనింగ్

రేపటి నుంచి 6 విడతల్లో ప్రత్యేక శిక్షణ 
2 వారాలపాటు స్పెషల్ ప్రోగ్రామ్ 
10 వేల మందికి శిక్షణ ఇచ్చేలా విద్యాశాఖ ప్లాన్
సీఎం ఆదేశాలతో వేగంగా చర్యలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు బడుల్లో కొత్తగా నియమితులైన వేలాది మంది టీచర్లకు బోధనా నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ చర్యలు  ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, కొత్త టీచర్ల కోసం 'కాంప్రహెన్సివ్ ఫౌండేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్'ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ శిక్షణ ద్వారా డీఎస్సీ 2024 ద్వారా నియమితులైన 10 వేల మంది టీచర్లను సిద్ధం చేయాలని విద్యాశాఖ  డిసైడ్ అయింది. 

రేపటి నుంచే తొలి బ్యాచ్‌‌

స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం, ఎస్సీఈఆర్టీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ శిక్షణ కార్యక్రమాలు హైదరాబాద్‌‌లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ ఇన్‌‌స్టిట్యూట్‌‌లో రెసిడెన్షియల్ పద్ధతిలో జరగనున్నాయి. మొత్తం 6 విడతలుగా ఈ ట్రైనింగ్ ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా మొదటి బ్యాచ్‌‌లోని 57 మంది టీచర్లకు సెప్టెంబర్ 21 నుంచి  శిక్షణ ప్రారంభం కానుంది. ఇది అక్టోబర్ 3 వరకు మొత్తం 2 వారాల పాటు కొనసాగుతుంది. దశలవారీగా మిగిలిన టీచర్లందరికీ ఈ శిక్షణను పూర్తి చేయనున్నారు.

40 సెషన్లు.. స్పెషల్ స్టడీ టూర్లు

కొత్తగా విధుల్లో చేరిన టీచర్లకు పాఠశాల స్థాయి నిర్వహణ, నూతన బోధనా పద్ధతులపై పూర్తి అవగాహన కల్పించేలా ఈ ట్రైనింగ్‌‌ను రూపొందించారు. 2 వారాల వ్యవధిలో సుమారు 40 సెషన్లను నిర్వహించనున్నారు. కేవలం క్లాసు రూములకే పరిమితం కాకుండా, టీచర్లు వృత్తిపరంగా మెరుగవ్వడానికి వీలుగా 2 రోజుల పాటు ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి. దీనివల్ల క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఏ విధంగా మెరుగైన విద్యను అందించాలో టీచర్లకు అవగాహన కలుగుతుందని అధికారులు చెబుతున్నారు.

కాగా, శిక్షణకు ఎంపికైన టీచర్లు తప్పనిసరిగా హాజరుకావాలని స్కూల్ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఆదేశించారు. హెడ్మాస్టర్లు కూడా తమ పరిధిలోని టీచర్లకు ముందస్తు సమాచారం అందించి, శిక్షణకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మిగిలిన బ్యాచ్‌‌లకు సంబంధించిన షెడ్యూల్‌‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్టు చెప్పారు.