చేవెళ్ల, వెలుగు: లేడీ అడ్వకేట్ స్వప్న హత్య కేసులో సొంత అన్న సహా నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు భూ వివాదమే కారణమని తేల్చారు. గురువారం మొయినాబాద్ పీఎస్‌లో కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. చేవెళ్ల కోర్టులో అడ్వొకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్న గొటికె స్వప్న (34), ఆమె అన్న గొటికె రాజుకు మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలోని సర్వే నంబరు 339లో 4 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. ఈ భూమిని ఎలాగైనా చేజిక్కించుకోవాలనే ఉద్దేశంతో రాజు పలువురితో కలిసి స్వప్న హత్యకు కుట్ర పన్నాడు.
గురువారం ఉదయం స్వప్న, ఆమె తల్లి వెంకటమ్మ భూ సర్వే చేస్తున్నారని తెలుసుకున్న నిందితులు.. అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సర్వే పూర్తి చేసుకొని వెంకటాపూర్- నక్కలపల్లి రహదారికి దగ్గరికి వచ్చిన స్వప్నను కారుతో ఢీకొట్టడంతో ఆమె ఒక గుంతలో పడిపోయింది. వెంటనే పెద్ద కర్రలు, రాళ్లతో స్వప్న తలపై దాడి చేసి.. కొడవలితో గొంతు కోయడంతో ఆమె మరణించారు.
