లోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ 

లోక్ సభ నుంచి నలుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ 

ఢిల్లీ : లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలు సస్పెన్షన్ కు గురయ్యారు. సభకు పదే పదే ఆటంకం కలిగిస్తున్నారని స్పీకర్ ఓం బిర్లా నలుగురు ఎంపీలను సస్పెండ్ చేశారు. మాణిక్కం ఠాగూర్ సహా టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్ పై వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకూ సస్పెండ్ వేటు పడింది. 

గ్యాస్ సిలిండర్ ధరల పెంపు, మైదా, మజ్జిగ, పెరుగు వంటి వస్తువులపై జీఎస్టీ విధించడంపై కాంగ్రెస్ ఎంపీలు లోక్ సభలో ప్లకార్డులతో నిరసన తెలియజేశారు. ఈ అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ వాయిదా తీర్మానం ఇచ్చారు. ధరల పెరుగుదలపై లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసనలు చేపట్టారు. అయితే.. నిరసన తెలియజేయాలనుకుంటే సభ బయట ప్లకార్డులు ప్రదర్శించాలని, సభలో ప్రదర్శించకూడదని స్పీకర్ ఓం బిర్లా సూచించారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత చర్చకు సిద్ధంగా ఉన్నామని, తమ ఓపికను బలహీనతగా భావించవద్దంటూ హెచ్చరించారు.

అంతకుముందు సభ వాయిదా పడిన తర్వాత మరోసారి సభలోకి ప్లకార్డులతో వచ్చి నిరసన తెలియజేశారు. దీంతో సభకు పదేపదే ఆటంకం కలుగుతుండడంతో పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విపక్ష ఎంపీల తీరును ఖండించారు. సభలోకి ప్లకార్డులు తీసుకొచ్చిన కాంగ్రెస్ కు చెందిన నలుగురు ఎంపీలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ ఓం బిర్లాను కోరారు. దీంతో నలుగురిని స్పీకర్ సస్పెండ్ చేశారు. ఆగస్టు 12వ తేదీన వర్షాకాల సమావేశాల ముగియనున్నాయి. అప్పటి వరకూ నలుగురు ఎంపీలపై వేటు పడినట్లే.

కేంద్రంపై కాంగ్రెస్ ఆగ్రహం

సస్పెన్షన్ కు గురైన అనంతరం నలుగురు ఎంపీలు పార్లమెంటు మైదానంలోని మహాత్మాగాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి నినాదాలు చేశారు. కేంద్రంపై నిప్పులు చెరిగారు. తమ ఎంపీల్లో కొందరిని సస్పెండ్ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ మండిపడింది. ప్రజలకు సంబంధించిన అంశాలను పార్లమెంటులో ప్రశ్నిస్తుంటే కేంద్రం తమ సభ్యుల గొంతు నొక్కేస్తోందని ఆరోపించింది.