సెన్సెక్స్ @ 41,000..దునియా మొత్తం మార్కెట్ల​ కళకళ

సెన్సెక్స్ @ 41,000..దునియా మొత్తం మార్కెట్ల​ కళకళ
  • మన సెన్సెక్స్ @  41,000
  • అమెరికా-–చైనా వ్యాపారంపై గుడ్​ న్యూస్​
  • బ్రిటన్​లో కన్జర్వేటివ్​ పార్టీ విజయంతో ఊపు

ముంబై స్టాక్ మార్కెట్ మళ్లీ దంచికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా పాజిటివ్ సంకేతాలు,  బ్లూచిప్స్ కౌంటర్లలో కొనుగోళ్లు.. మార్కెట్‌‌ను పరుగులు పెట్టించాయి. బీఎస్‌‌ఈ సెన్సెక్స్ 428 పాయింట్ల మేర జంప్ చేసి, 41 వేల మార్క్‌‌కు పైన నిలిచింది. ఇంట్రాడేలో 41,055.80 వద్ద గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్, చివరికి 41,009.71 వద్ద క్లోజైంది. నిఫ్టీ సైతం 114.90 పాయింట్లు లాభపడి 12,086.70 వద్ద స్థిరపడింది. అమెరికా–చైనాల మధ్య ట్రేడ్‌‌ డీల్‌‌ సుఖాంతం కాబోతుందని వార్తలు, యూకే జనరల్ ఎలక్షన్స్‌‌లో బోరిస్ జాన్సన్ విజయం గ్లోబల్‌‌గా ఈక్విటీ మార్కెట్లలో సెంటిమెంట్‌‌ను పెంచాయి. గ్లోబల్‌‌గా వస్తున్న ఈ సంకేతాలతో ఇండియన్ మార్కెట్‌‌లో కొనుగోళ్ల పర్వం కొనసాగింది. చైనాతో ఫేస్‌‌ వన్ ట్రేడ్‌‌ డీల్‌‌ను అమెరికా ఖరారు చేసిందని వార్తలొస్తున్నాయి. దీంతో అమెరికాకు చెందిన మరిన్ని గూడ్స్‌‌ను బీజింగ్ కొననుంది. ఈ డీల్‌‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తుది ఆమోదం తెలిపితే.. టారిఫ్స్‌‌ను ఎత్తివేయనున్నారు. 17 నెలల ట్రేడ్ వార్‌‌‌‌కి ఫుల్‌‌ స్టాప్ పడనుంది. బోరిస్ గెలవడంతో, బ్రెగ్జిట్‌‌పై ఆందోళనలు తొలుగుతున్నాయి.

బ్యాంకు షేర్లకు లాభాల పంట

సెన్సెక్స్ ప్యాక్‌‌లో యాక్సిస్ బ్యాంక్‌‌ టాప్ గెయినర్‌‌‌‌గా 4.21 శాతం ర్యాలీ చేసింది. వేదంతా షేర్లు 3.75 శాతం, ఎస్‌‌బీఐ షేర్లు 3.39 శాతం, మారుతీ షేర్లు 3.20 శాతం, ఇండస్‌‌ఇండ్ బ్యాంక్ షేర్లు 3.07 శాతం, యెస్‌‌ బ్యాంక్ షేర్లు 2.87 శాతం లాభపడ్డాయి. ఆర్థిక డేటాకు సంబంధించిన లెక్కలు బాగోలేకపోవడంతో మార్కెట్లు వీక్‌‌గా ప్రారంభమయ్యాయని, అయితే గ్లోబల్‌‌గా సంకేతాలు పాజిటివ్‌‌గా ఉండటంతో, వారాంతాన్ని మార్కెట్ లాభాలతో ముగించిందని ఈవీపీ ఈక్విటీ రీసెర్చ్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ నరేంద్ర సోలంకి చెప్పారు. ఆర్థిక మంత్రి పాజిటివ్‌‌ ప్రకటనలు చేస్తారనే ఆశలతో కూడా మార్కెట్ చివరిలో బలపడిందని సోలంకి చెప్పారు.  బీఎస్‌‌ఈలో మెటల్, రియాల్టీ,  ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్, టెక్, బ్యాంకెక్స్, ఫైనాన్స్ సూచీలు బాగా లాభపడ్డాయి.

ఉజ్జీవన్ షేర్లకు రెండో రోజే నష్టాలు..

మార్కెట్‌‌లో బంపర్ బోణితో లిస్ట్ అయిన ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌‌ షేర్లకు రెండో రోజే అమ్మకాల తాకిడి తగిలింది. దీంతో లిస్ట్‌‌ అయిన రెండో రోజే షేర్లు నష్టాలు పాలయ్యాయి. ప్రాఫిట్ బుకింగ్‌‌తో ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్లు శుక్రవారం సుమారు 7 శాతం మేర తగ్గాయి. బీఎస్‌‌ఈలో 6.89 శాతం నష్టపోయిన షేర్లు రూ.52.05 వద్ద క్లోజయ్యాయి. ఇంట్రాడేలో ఈ షేర్లు 8.49 శాతం పడిపోయి రూ.51.15గా రికార్డయ్యాయి. ఎన్‌‌ఎస్‌‌ఈలో కూడా 6 శాతం నష్టంతో రూ.52.55 వద్ద ముగిశాయి. కంపెనీకి చెందిన 27.97 లక్షల షేర్లు బీఎస్‌‌ఈలో ట్రేడ్‌‌ కాగా, ఎన్‌‌ఎస్‌‌ఈలో 4 కోట్లకు పైగా షేర్లు ట్రేడింగ్ జరిపాయి. గురువారం ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇష్యూ ధర రూ.37కు 57 శాతం ప్రీమియంతో మార్కెట్‌‌లో లిస్ట్ అయింది. చివరికి 51 శాతం లాభంతో ముగిసింది.