పీఎస్​బీల ఖజానా కళకళ

పీఎస్​బీల ఖజానా కళకళ
  •      2024లో లాభం రూ. 1.4 లక్షల కోట్లు 
  •     వార్షికంగా 35 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: ప్రస్తుత ఏడాది మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభం రూ. 1.4 లక్షల కోట్లు దాటింది. వార్షికంగా 35 శాతం వృద్ధి నమోదైంది.  మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్​బీలు) కలిసి 2022-–23లో రూ. 1,04,649 కోట్ల నికర లాభాన్ని ఆర్జించాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన రూ. 141,203 కోట్ల మొత్తం లాభంలో, మార్కెట్ లీడర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటా 40 శాతం వరకు ఉంది. ఎస్‌‌‌‌‌‌‌‌బీఐ గత ఆర్థిక సంవత్సరం (రూ. 50,232 కోట్లు) కంటే 22 శాతం అధికంగా రూ.61,077 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

ఢిల్లీకి చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ అత్యధిక నికర లాభం 228 శాతం పెరుగుదలతో రూ. 8,245 కోట్లకు చేరగా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 62 శాతం వృద్ధితో రూ. 13,649 కోట్లకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాభం 61 శాతం వార్షికవృద్ధితో రూ. 2,549 కోట్లకు పెరిగింది. నికర లాభంలో 50 శాతానికి పైగా జంప్ నమోదు చేసిన బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 57 శాతం వృద్ధితో రూ. 6,318 కోట్లకు చేరుకోగా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 56 శాతం వృద్ధితో రూ. 4,055 కోట్లకు, చెన్నైకి చెందిన ఇండియా బ్యాంక్ లాభం 53  శాతం పెరిగి 8,063 కోట్లకు చేరింది.

 లాభాల్లో తగ్గుదలని నివేదించినది ప్రభుత్వ రంగ బ్యాంక్ పంజాబ్ అండ్​ సింధ్ బ్యాంక్ మాత్రమే. దీని వార్షిక నికర లాభంలో 55 శాతం తగ్గింది. 2022-–23లో రూ. 1,313 కోట్ల నుంచి మార్చి 2024తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో రూ. 595 కోట్లకు పడిపోయింది. వార్షిక లాభం రూ.10 వేల కోట్లు మించిన వాటిలో బ్యాంక్ ఆఫ్ బరోడా (రూ. 17,788 కోట్లు)  కెనరా బ్యాంక్ (రూ. 14,554 కోట్లు) ఉన్నాయి.  

సంస్కరణలు కీలకం..

పీఎస్​బీలకు 2018లో రూ. 85,390 కోట్ల నష్టం ఉండగా, 2024 ఆర్థిక సంవత్సరంలో రికార్డ్ లాభానికి రావడం ఒక కీలకదశ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం, మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ఆయన వారసురాలు నిర్మలా సీతారామన్,  ఆర్థిక సేవల కార్యదర్శి చేపట్టిన కార్యక్రమాలు,  సంస్కరణల పరంపర ఈ విజయానికి కారణమని చెప్పవచ్చు.  కేంద్ర ప్రభుత్వం పీఎస్​బీల పునరుద్ధరణ కోసం ‘4ఆర్’ వ్యూహాన్ని అమలు చేసింది.

వీటిలో ఎన్​పీఏలను పారదర్శకంగా గుర్తించడం, రిజల్యూషన్  రికవరీ, పీఎస్​బీలను రీక్యాపిటలైజ్ చేయడం  ఆర్థిక పర్యావరణ వ్యవస్థలో సంస్కరణలు ఉన్నాయి. గత ఐదు ఆర్థిక సంవత్సరాల్లో.. అంటే -- 2016–-17 నుంచి 2020–-21 వరకు పీఎస్​బీ లను భారీగా రూ.3,10,997 కోట్ల మూలధనాన్ని సమకూర్చారు. రీక్యాపిటలైజేషన్ ప్రోగ్రామ్ పీఎస్​బీలకు అవసరమైన మద్దతును అందించింది. డిఫాల్ట్ అయ్యే అవకాశాన్ని నిరోధించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడం,  బ్యాంకుల విలీనం వంటివీ పీఎస్​బీలకు మేలు చేశాయి.