వెండి విషయంలో చైనా తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ మార్కెట్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వెండి, టంగ్స్టన్, యాంటిమనీ వంటి కీలక ఖనిజాల ఎగుమతులపై బీజింగ్ తన పట్టును మరింత బిగించింది. 2026, 2027 సంవత్సరాలకు సంబంధించి వెండిని విదేశాలకు ఎగుమతి చేసే అనుమతిని కేవలం 44 కంపెనీలకు మాత్రమే పరిమితం చేస్తూ చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల. గత ఏడాదితో పోలిస్తే.. ఈ సంఖ్య స్వల్పంగా పెరిగినప్పటికీ, ఎగుమతులపై నియంత్రణలు మాత్రం చాలా కఠినంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఖనిజాల సప్లై చైన్ విషయంలో చైనాది ఆధిపత్య స్థానం కొనసాగుతోంది. అమెరికాతో పెరుగుతున్న వాణిజ్య యుద్ధం, చిప్ తయారీపై ఆంక్షలు, ఇతర భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా తన వద్ద ఉన్న సహజ వనరులను ఒక 'అస్త్రం'గా వాడుకుంటోంది. జాతీయ భద్రత పేరుతో సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగం, మందుగుండు సామగ్రి తయారీలో వాడే ఈ లోహాల ఎగుమతులను నియంత్రించడం ద్వారా తన దేశీయ అవసరాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తోంది చైనా.
ఈ క్రమంలో 2026లో వెండి ధరలు బంగారం కంటే వేగంగా దూసుకుపోతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. పారిశ్రామికంగా వెండికి ఉన్న భారీ డిమాండ్, ముఖ్యంగా బ్యాటరీల తయారీలో దీని వినియోగం పెరుగుతుండటం డిమాండ్ పెరగటానికి ఒక ప్రధాన కారణంగా ఉంది. రాబోయే రెండు మూడు ఏళ్లలో గ్లోబల్ వెండి ఉత్పత్తిలో దాదాపు 60 శాతం కేవలం బ్యాటరీ రంగానికే సరిపోతుందని, దీనివల్ల మార్కెట్లో వెండి కొరత ఏర్పడి ధరలు ఆకాశాన్ని తాకుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
టెక్నికల్ గా చూస్తే.. వెండి ధరలు దశాబ్దాల కాలం నాటి నిరోధక స్థాయిలను అధిగమించి ముందుకు సాగుతున్నాయి. భారతీయ మార్కెట్లో మార్చి 31 నాటికి కేజీ వెండి ధర 3 లక్షల రూపాయలకు చేరుకోవచ్చని కొందరు నిపుణులు అంచనా వేస్తుండగా.. అంతర్జాతీయంగా 2030-2032 నాటికి ఒక ఔన్సు వెండి ధర 150 నుంచి 180 డాలర్ల వరకు వెళ్లవచ్చనే అంచనాలు ఉన్నాయి. వెండి కేవలం ఒక విలువైన లోహంగానే కాకుండా.. ఆధునిక సాంకేతిక రంగానికి వెన్నెముకగా మారడంతో దీనికి ఉన్న ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతోందని వారు అంటున్నారు.
