T20 World Cup Final: టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రేపు ( మార్చి 8న) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది. దీంతో ఇండియన్ టీమ్ బస చేసే హోటల్ ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) చివరి నిమిషంలో మార్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. హోటల్ మార్పుకు గల కారణాలను కూడా వెల్లడించకపోయినప్పటికీ.. అహ్మదాబాద్‌లో అదే హోటల్‌లో బస చేసిన్నప్పుడు భారత్‌కు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ముఖ్యంగా 2023 వరల్డ్ కప్ ఫైనల్ సమయంలో భారత్ ఓటమి చవిచూసింది.. అలాగే ఈ టోర్నమెంట్‌లో సూపర్-–8 దశలో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కూడా టీమిండియా ఓడిపోవడం వలనే.. ఫైనల్‌కు ముందు హోటల్ ని మార్చినట్లు సమాచారం.
మరోవైపు, భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్ వీక్షించాలని అనుకునే క్రికెట్ అభిమానుల కోసం పశ్చిమ రైల్వే ప్రత్యేక చర్యలను చేపట్టింది. ముంబై నుంచి అహ్మదాబాద్ కి ప్రత్యేకంగా రైలును నడిపిస్తున్టన్లు తెలిపింది. ఇప్పటికే అహ్మదాబాద్ కి విమాన టికెట్ల ధరలు పెరిగడంతో.. పశ్చిమ రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం ఫ్యాన్స్ కి కొంత ఊరట కలిగించనుంది. ఇక ఎయిరిండియా, ఆకాశ ఎయిర్, భారత క్రికెట్ ఫ్యాన్స్ కోసం ప్రత్యేక విమానాలను నడిపిస్తున్నాయి. దేశంలోని పలు నగరాల నుంచి అహ్మదాబాద్ కి ఫ్లైట్ టికెట్లకు డిమాండ్ ఒక్కసారిగా పెరగడంతో విమానయాన సంస్థలు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి.
ఇండియన్ టీమ్ కి మద్దతుగా వేల సంఖ్యలో ఫ్యాన్స్ నరేంద్రమోడీ స్టేడియానికి రానున్నారు. క్రికెట్ అభిమానుల సౌకర్యార్థం ఢిల్లీ, బెంగళూరు, ముంబై, హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ కి అదనపు ఫ్లైట్స్ ను నడపనున్నాం.. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఒక్కసారిగా విమాన టిక్కెట్ల ధర పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఓ ప్రకటన విడుదల చేసింది. మార్చి 8, 9 తేదీల్లో ముంబై నుంచి అహ్మదాబాద్ కి ప్రత్యేక విమానాలు నడపనున్నట్లు ఆకాశ ఎయిర్ లైన్స్ కూడా వెల్లడించింది.
