ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసిందా..? ఈ రూల్ తెలిస్తే మిమ్మల్ని మోసం చేయలేరు

ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ రిజెక్ట్ చేసిందా..? ఈ రూల్ తెలిస్తే మిమ్మల్ని మోసం చేయలేరు

లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత.. క్లెయిమ్ సెటిల్‌మెంట్ విషయంలో చాలామందిలో ఒకరకమైన భయం ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏదో ఒక టెక్నికల్ కారణం చెప్పి క్లెయిమ్‌ను తిరస్కరిస్తాయేమోనని పాలసీదారులు ఆందోళన చెందుతుంటారు. అయితే భారతీయ చట్టం పాలసీదారులకు ఈ విషయంలో కొండంత అండగా నిలుస్తోంది. ఇన్సూరెన్స్ చట్టం, 1938లోని 'సెక్షన్ 45' ప్రకారం.. పాలసీ అమలులోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయ్యాక ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా క్లెయిమ్‌ను ఇష్టానుసారంగా తిరస్కరించడానికి వీల్లేదు. దీనినే ఇన్సూరెన్స్ రంగంలో "3-ఇయర్స్ రూల్" అని పిలుస్తుంటారు.

ఈ రూల్ ప్రకారం ఒక పాలసీ జారీ చేసిన తేదీ నుంచి లేదా రిస్క్ ప్రారంభమైన తేదీ నుంచి లేదా పాలసీని రెన్యూవల్ చేసిన తేదీ నుండి వరుసగా మూడేళ్లు పూర్తయితే.. ఆ తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీదారుడి గత వివరాలను లేదా ఆరోగ్య సమాచారాన్ని ప్రశ్నించే హక్కును కోల్పోతుంది. పాలసీ తీసుకునే సమయంలో ఏదైనా సమాచారాన్ని దాచారని లేదా తప్పుగా చెప్పారని సాకు చూపి క్లెయిమ్‌ను ఆపడం 3 ఏళ్లు గడిచిన తర్వాత చట్ట ప్రకారం సాధ్యం కాదు. ఒకవేళ కంపెనీ క్లెయిమ్ తిరస్కరించాలి అనుకుంటే.. పాలసీదారుడు ఉద్దేశపూర్వకంగా మోసానికి పాల్పడ్డారని నిరూపించాల్సిన బాధ్యత పూర్తిగా సదరు ఇన్సూరెన్స్ కంపెనీపైనే ఉంటుంది.

మొదటి మూడేళ్ల కాలం మాత్రం ఇన్సూరెన్స్ కంపెనీలకు అత్యంత కీలకం. ఈ సమయంలో పాలసీదారుడు ఇచ్చిన సమాచారాన్ని విచారించే పూర్తి హక్కు వారికి ఉంటుంది. ఒకవేళ ఆరోగ్య సమస్యలను దాచినా లేదా తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించినా ఈ దశలో క్లెయిమ్‌ను తిరస్కరించే అవకాశం ఉంటుంది. కానీ.. ఒక్కసారి ఆ మూడేళ్ల గీత దాటితే పాలసీకి బలమైన చట్టపరమైన రక్షణ లభిస్తుంది. ప్రస్తుతం భారత ఇన్సూరెన్స్ రంగంలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో కూడా అద్భుతంగా మెరుగుపడింది. 2014లో 85 శాతంగా ఉన్న ఈ రేషియో.. ప్రస్తుతం 99 శాతానికి పైగా చేరుకోవడం విశేషం.

అయినప్పటికీ.. కొన్ని సందర్భాల్లో భారీ మొత్తంతో కూడిన టర్మ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల విషయంలో కంపెనీలు మూడేళ్ల తర్వాత కూడా అదనపు పత్రాల కోసం పాలసీదారుల కుటుంబాలను ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి సమయంలో 'సెక్షన్ 45' గురించి అవగాహన ఉండటం పాలసీదారులకు చాలా ముఖ్యం. పాలసీదారుడి కుటుంబ సభ్యులు లేదా వారి ఏజెంట్లు ఈ చట్టపరమైన రక్షణ గురించి గట్టిగా గుర్తుచేసి, నిరంతరం ఫాలో-అప్ చేస్తే నిలిచిపోయిన క్లెయిమ్‌లు కూడా సెటిల్ అవుతాయి. నిజాయితీగా ప్రీమియం చెల్లించే పాలసీదారుల ప్రయోజనాలను కాపాడటమే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం.