కలియుగ వైకుంఠం తిరుమలలో దివ్వెల మాధురి కేక్ కట్ చేయడం దుమారం రేపిన సంగతి తెలిసిందే. కేక్ కట్ చేసి తిరుమల పవిత్రతను దెబ్బతీశారంటూ అటు సోషల్ మీడియా, ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. దివ్వెల మాధురిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో కేక్ కటింగ్ వివాదంపై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. డైవర్షన్ కోసమే తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు దువ్వాడ శ్రీనివాస్.
టీటీడీ చైర్మెన్ తనపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయించారని.. ఆయన వీడియోలో తప్పు లేనప్పుడు ఎగ్ లెస్ కేక్ కటింగ్ లో తప్పేముంది అంటూ ప్రశ్నించారు దువ్వాడ శ్రీనివాస్. కేసులు అంటే భయపడే వ్యక్తిని కాదని అన్నారు. నేత్ర దర్శనం రోజు కూడా తమపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు దువ్వాడ శ్రీనివాస్.
తాము తప్పు చేయలేదని.. కోర్టులోనే తేల్చుకుంటామని అన్నారు. తప్పు చేసినట్లయితే స్వామివారి శిక్షకు బాధ్యులమవుతామని అన్నారు. ఈ క్రమంలో దివ్వెల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ లపై టీటీడీ, కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుందా లేదా అన్నది వేచి చూడాలి.
ఇదిలా ఉండగా..ఇటీవల తిరుమల కొండపై తరచూ ఏదో ఒక వివాదం జరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. తిరుమల పవిత్రతను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకొని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు భక్తులు.
