పద్మారావునగర్, వెలుగు: వరల్డ్ హియరింగ్ డేను పురస్కరించుకుని శుక్రవారం గాంధీ మెడికల్ కాలేజీలో మీనాక్షి వెంకట రామన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 30 మంది చిన్నారులకు ఉచితంగా డిజిటల్ హియరింగ్ ఎయిడ్స్ పంపిణీ చేశారు. నవజాత శిశువులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, వినికిడి లోపాన్ని గుర్తించిన వెంటనే ఫౌండేషన్ ద్వారా వైద్య సాయం అందిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా అంధుల సేవలో విశేష కృషి చేస్తున్న పద్మశ్రీ డా. సాయిబాబా గౌడ్‌ను, కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీలు విజయవంతంగా నిర్వహిస్తున్న గాంధీ ఈఎన్ టీ హెచ్ఓడీ ప్రొఫెసర్ భూపేందర్ సింగ్ రాథోడ్‌ను సన్మానించారు.
చూపు కోల్పోయినా పట్టుదలతో లా చదువుతూ, ఐఏఎస్‌కు సిద్ధమవుతున్న నల్లగొండ యువకుడు అభిషేక్‌కు మీనాక్షి ఫౌండేషన్ చాంపియన్ అవార్డు-2026 ఈ సందర్భంగా అందజేశారు.
