అసలు మనుషులేనా మీరు : ర్యాగింగ్ తర్వాత చనిపోయిన 19 ఏళ్ల విద్యార్థిని..

అసలు మనుషులేనా మీరు : ర్యాగింగ్ తర్వాత చనిపోయిన 19 ఏళ్ల విద్యార్థిని..

ర్యాగింగ్ భూతం ఇప్పటికి విద్యార్థులను బలితీసుకుంటునే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్న... ర్యాగింగ్ చేసిన వారిని కఠినంగా శిక్షించిన ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు ఈ ర్యాగింగ్ కి గురవుతూనే ఉన్నారు. కాలేజీల్లో యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్  ఏర్పాటు చేసిన ఫలితం లేకుండా పోతుంది. తాజాగా జరిగిన ఓ ఘటన ర్యాగింగ్ కి ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందో అని కలవరపెడుతుంది.  

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన ఈ విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ర్యాగింగ్, వేధింపుల కారణంగా 19 ఏళ్ల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడంతో, కాలేజ్  ప్రొఫెసర్‌తో పాటు ముగ్గురు విద్యార్థినులపై పోలీసులు కేసు నమోదైంది. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు చూస్తే ధర్మశాలలోని సిద్బరి ప్రాంతానికి చెందిన ఓ యువతి స్థానిక ప్రభుత్వ కాలేజీలో  సెకండ్ ఇయర్ చదువుతోంది. సెప్టెంబర్ 2025లో అదే కాలేజీకి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఆమెను దారుణంగా కొట్టి, బెదిరించారని తెలుస్తుంది. అంతేకాకుండా, ఒక ప్రొఫెసర్ కూడా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి.

ఈ వేధింపుల వల్ల ఆ యువతి తీవ్ర భయాందోళనకు, మానసిక ఒత్తిడికి గురైంది. దింతో  ఆమె ఆరోగ్యం దెబ్బతిని హిమాచల్ ప్రదేశ్‌లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటుంది. పరిస్థితి రోజురోజుకి తీవ్రంగా విషమించడంతో లూథియానాలోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ 26 డిసెంబర్  2025న చనిపోయింది. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కూతురు అనారోగ్యం, మరణం వల్ల  ఫిర్యాదు చేయడం ఆలస్యమైందని తండ్రి తెలిపారు.

 ఈ ఘటనపై ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన పోలీసులకు, ప్రభుత్వానికి సిగ్గుచేటని, బాధితురాలికి త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రస్తుతం ఈ కేసుపై విచారణ జరుపుతుండగా... నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్ నిరోధక చట్టం కింద అలాగే కొత్త భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.