టీమిండియా న్యూ ఇయర్ లో న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా జనవరి 11న గుజరాత్ వడోదరలోని కోటంబి స్టేడియంలో న్యూజిలాండ్‌తో మొదటి వన్డే ఆడనుంది. ఈ సిరీస్ కోసం జనవరి 3న బీసీసీఐ సెలెక్టర్లు ఈ న్యూ ఇయర్ లో తొలి హోమ్ సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించనున్నారు.
అయితే ఈ వన్డే సిరీస్ లోకి కీలక టీమిండియా కీలక ఆటగాళ్లు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ఐదుగురి ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో శుభ్ మన్ గిల్, మహమ్మద్ షమీ,అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్,మహ్మద్ సిరాజ్ వీళ్లు జట్టులోకి వచ్చే అవకాశాలున్నట్లు క్రికెటర్ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది.
న్యూజిలాండ్ సిరీస్ సమయంలో శుభ్‌మన్ గిల్ భారత్ తరఫున వన్డే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మెడ గాయం కారణంగా నవంబర్- డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి వన్డే సిరీస్‌కు గిల్ దూరమయ్యాడు. శుభ్ మన్ అక్టోబర్ 4, 2025న టీమిండియాకు కెప్టెన్ గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్ సిరీస్ కు కూడా కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
మహమ్మద్ షమీ కూడా చివరిసారిగా మార్చి 9న దుబాయ్‌లో న్యూజిలాండ్‌తో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ సందర్భంగా మెన్ ఇన్ బ్లూ తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. వన్డే ప్రపంచ కప్ చరిత్రలో భారత తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ అయిన షమీ- .. ఇప్పటివరకు ఆడిన 108 వన్డేల్లో 206 వికెట్లు తీశాడు.
అక్షర్ పటేల్ కు 2025లో జరిగిన దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టులో చోటు దక్కలేదు. ఈ సారి న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది .వన్డేల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న అక్షర్, స్వదేశీ సిరీస్ కోసం వాషింగ్టన్ సుందర్ స్థానంలో జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.
ఇక మరో యంగ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ రెండు సంవత్సరాల తర్వాత భారత్ తరపున వన్డే రీ ఎంట్రీ చేయబోతున్నట్లు సమాచారం.ఇషాన్ చివరిసారిగా అక్టోబర్ 11, 2023న ఢిల్లీలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత్ తరఫున ఆడాడు. రిషబ్ పంత్ స్థానంలో భారత జట్టు రెండవ వికెట్ కీపర్-బ్యాటర్‌గా అతను బరిలోకి దిగే అవకాశం ఉంది.
న్యూజిలాండ్‌తో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను కూడా తీసుకునే అవకాశం ఉంది.సిరాజ్ చివరిసారిగా 2025 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ ఆడాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన స్వదేశీ సిరీస్‌కు అతన్ని పక్కన పెట్టారు.
