కొత్త ఏడాది వేడుకల్లో అసలైన 'హీరోలు' ఎవరంటే.. ఖచ్చితంగా గిగ్ వర్కర్లనే చెప్పుకోవాలి. ప్రపంచమంతా చిల్ అవుతుంటే.. వీరు మాత్రం బిజీ రోడ్లపై ఆర్డర్ల వేటలో ఉన్నారు. సరిగ్గా న్యూఇయర్ వేడుకలకు ముందు తమ డిమాండ్లతో స్ట్రైక్ ప్రకటించటంతో కంపెనీలు దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2026 న్యూ ఇయర్ ఈవ్ సందర్భంగా భారతీయ డెలివరీ వర్కర్లు సృష్టించిన రికార్డు మామూలుది కాదు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్ వంటి సంస్థలు డెలివరీ బాయ్స్‌కు కేవలం ఒక్క రోజులోనే 100 కోట్ల రూపాయలకు పైగా చెల్లింపులు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించాయి.
సాధారణ రోజుల్లో ఈ సంస్థలన్నీ కలిపి డెలివరీ పార్ట్‌నర్లకు సుమారు రూ.60-70 కోట్లు చెల్లిస్తుంటాయి. కానీ.. ఈ న్యూ ఇయర్ వేడుకల్లో ఆర్డర్లు సునామీలా రావడంతో గిగ్ వర్కర్ల ఆదాయం 30-40 శాతం పెరిగింది. ఒక్క మాటలో చెప్పాలంటే.. విందు వినోదాల మధ్య మన ఆకలి తీర్చిన డెలివరీ భాగస్వాములు కూడా భారీగా సంపాదించింది.
నిజానికి ఈ ఏడాది వేడుకలపై గిగ్ వర్కర్ల స్ట్రైక్ ప్రకటనతో నీలినీడలు కమ్ముకున్నాయి. కొన్ని కార్మిక సంఘాలు ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో డెలివరీలు నిలిచిపోతాయని, కస్టమర్లు ఇబ్బంది పడతారని అందరూ భయపడ్డారు. కానీ.. సీన్ కట్ చేస్తే.. గ్రౌండ్ లెవల్‌లో సీన్ రివర్స్ అయింది. దీనికి కారణంగా కంపెనీలు కూడా సానుకూలంగా స్పందించి న్యూఇయర్ స్పెషల్ ఇన్వెస్టివ్‌ల వర్షం కురిపించటమే. కేవలం ఒక్క రోజే 75 లక్షలకు పైగా ఆర్డర్లు డెలివరీ అయ్యాయని జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ వెల్లడించారు. వాస్తవానికి ఇది ఒక ఆల్-టైమ్ రికార్డ్ అని చెప్పారు.
పండుగ రోజులు, రద్దీ సమయాల్లో కస్టమర్లు ఎక్కువగా ఆర్డర్లు చేస్తుంటారు. దీనికి తోడు కంపెనీలు డెలివరీ పార్ట్‌నర్లకు అదనపు ఇన్సెంటివ్‌లు అందిస్తాయి. సమ్మెకు వెళ్తే తమకు వచ్చే రూ.100 కోట్ల ఆదాయాన్ని కోల్పోతామని గ్రహించిన డెలివరీ వర్కర్లు కూడ కంపెనీలు ఆఫర్ చేసిన పేకి అంగీకరించాయి. మెుత్తానికి ఈ సారి న్యూఇయర్ సందర్భంగా ఫుడ్ డెలివరీ సంస్థలు రూ.60-70 కోట్లు చెల్లించగా.. మరో పక్క క్విక్ కామర్స్ కంపెనీలు రూ.50-60 కోట్లు గిగ్ వర్కర్ల ఖాతాల్లో వేశాయి. దీంతో 2026 ప్రారంభ వేడుకలు డెలివరీ సంస్థలకు కాసుల వర్షం కురిపిస్తే.. కష్టపడే డెలివరీ బాయ్స్‌కు అదిరిపోయే న్యూ ఇయర్ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది.
