అమెరికా మొక్కజొన్నపై పంది ఎరువు వివాదం.. బంగ్లాదేశ్‌లో మరో ఆగ్రహ జ్వాలలు..

అమెరికా మొక్కజొన్నపై పంది ఎరువు వివాదం.. బంగ్లాదేశ్‌లో మరో ఆగ్రహ జ్వాలలు..

అమెరికా నుండి బంగ్లాదేశ్‌కు మొక్కజొన్న దిగుమతి కాబోతుందన్న వార్త ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. సాధారణంగా ఇదొక వాణిజ్య ఒప్పందమే అయినప్పటికీ.. దీని వెనుక ఉన్న సాగు పద్ధతులు ముస్లిం మెజారిటీ దేశమైన బంగ్లాదేశ్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. డిసెంబర్ 27న ఢాకాలోని అమెరికా రాయబార కార్యాలయం చేసిన ఒక పోస్ట్ ఈ వివాదానికి ఆజ్యం పోసింది.

అమెరికా రాయబార కార్యాలయం తమ 'X' ఖాతాలో.. "అత్యంత పోషక విలువలున్న అమెరికా మొక్కజొన్న ఈ నెలలో బంగ్లాదేశ్‌కు చేరుకోనుంది" అని పోస్ట్ చేసింది. అయితే నెటిజన్లు దీనిపై విరుచుకుపడ్డారు. అమెరికాలో మొక్కజొన్న దిగుమతి పెంచడానికి 'పంది ఎరువు'ను ఉపయోగిస్తారని, అటువంటి పంటను ఇస్లామిక్ దేశమైన బంగ్లాదేశ్ ఎలా దిగుమతి చేసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు. ఇస్లాంలో పందికి సంబంధించిన పదార్థాలు నిషిద్ధం (హరామ్) కావడంతో ఈ అంశం సున్నితంగా మారింది.

ఈ వార్తపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ట్రంప్ ప్రభుత్వానికి తలవంచినందుకు బంగ్లాదేశ్‌కు పంది ఎరువుతో పండిన మొక్కజొన్న దక్కింది అని ఒక జర్నలిస్ట్ ఎద్దేవా చేశారు. పాపం బంగ్లాదేశీయులు.. ఇప్పుడు పంది ఎరువుతో పండిన ఆహారాన్ని తినాల్సి వస్తోంది.. ఎంజాయ్ చేయండి అంటూ మరికొందరు వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారు. అమెరికా తన మిగులు దిగుమతులను బంగ్లాదేశ్‌పై రుద్దుతోందని, ఇది అక్కడి ప్రజల మత విశ్వాసాలను దెబ్బతీయడమేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బంగ్లాదేశ్‌లో ఇలాంటి వివాదం రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో చేపల మేతలో పంది మాంసం అవశేషాలు ఉన్నాయని తేలడంతో 'మీట్ అండ్ బోన్ మీల్' పౌడర్‌ను ఆ దేశం నిషేధించింది. ఇప్పుడు నేరుగా పంది ఎరువుతో పండిన పంట రావడంపై అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఈ ఏడాది మొక్కజొన్న పంట భారీగా పండటంతో.. ఆ మిగులును భారత్, బంగ్లాదేశ్ వంటి దేశాలకు ఎగుమతి చేసేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే ఈ విమర్శలపై అమెరికా రాయబార కార్యాలయం ఇంకా స్పందించలేదు. మతపరమైన విశ్వాసాలు, అంతర్జాతీయ వాణిజ్యం మధ్య నలుగుతున్న ఈ 'మొక్కజొన్న వివాదం' చివరకు ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.