భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో కొత్తగా ఏర్పడిన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా సీపీఐ పార్టీకి చెందిన మూడ్ గణేష్,డిప్యూటీ మేయర్‌గా కాంగ్రెస్‌కు చెందిన సిరిపురం లలిత ఎన్నికయ్యారు. కార్పొరేషన్లో 60 డివిజన్లకు కాంగ్రెస్ 22, సీపీఐ 22, బీఆర్ఎస్ 8, సీపీఎం ఒకటి, బీజేపీ ఒకటి, ఆరుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్‌లో సోమవారం అడిషనల్ కలెక్టర్ డి. వేణుగోపాల్ మొదట 52 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికకు అడిషనల్ కలెక్టర్ కాల్ చేశారు. బీఆర్ఎస్కు చెందిన ఎనిమిది కార్పొరేటర్లు మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించి ప్రమాణ స్వీకారోత్సవానికి అటెండ్ కాలేదు.
ఏకగ్రీవంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక..
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్లను కార్పొరేటర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాకపోవడంతో కాంగ్రెస్, సీపీఐ పొత్తు పెట్టుకున్నాయి. చెరో రెండున్నరేండ్లు పాలన సాగించేలా ఇరు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ క్రమంలో మేయర్‌గా సుజాతనగర్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన సీపీఐ పార్టీకి చెందిన మూడ్ గణేష్‌ను కార్పొరేటర్ అడుసుమల్లి సాయిబాబు ప్రతిపాదించగా, ఇండిపెండెంట్ అభ్యర్థి కంబంపాటి దుర్గా ప్రసాద్ బలపర్చారు.
డిప్యూటీ మేయర్‌గా పాల్వంచ నుంచి గెలిచిన సిరిపురం లలితను కాంగ్రెస్ పార్టీకి చెందిన కె. శ్రీనివాస్ ప్రతిపాదించగా, సీపీఐకి చెందిన బోయిన విజయ్ కుమార్ బలపర్చారు. ఇతరులెవరూ పోటీ లేకపోవడంతో మూడ్ గణేష్, సిరిపురం లలితలను మేయర్, డిప్యూటీ మేయర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అడిషనల్ కలెక్టర్ ప్రకటించి, ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నికైన అనంతరం ఇద్దరూ సభలోనే ఉన్న ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుల వద్దకు వెళ్లి ఆశీర్వాదం పొందారు.
రాజకీయ వేదికగా రైస్ గ్రాండ్ రెస్టారెంట్ నగరంలోని రైస్ గ్రాండ్ రెస్టారెంట్ కాంగ్రెస్, సీపీఐ క్యాంపు రాజకీయాలకు వేదికగా మారింది. పలు ప్రాంతాల్లోని క్యాంపులకు తరలి వెళ్లిన కాంగ్రెస్, సీపీఐ కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి ముందుగా రైస్ గ్రాండ్ రెస్టారెంట్లో దిగారు. ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, సీపీఐ రాష్ట్ర నేత పల్లా వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి ఎస్కె. సాబీర్ పాషాతో చర్చించారు. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు నామినేషన్ వేసిన క్రమంలో ఎవరు బలపర్చాలి, ఎవరు ప్రతిపాధించాలో దిశానిర్దేశం చేశారు. ఇదిలా ఉండగా 11 గంటలకు కార్పొరేషన్ ఆఫీసుకు రావాల్సి ఉండగా దాదాపు అరగంటకు పైగా రెస్టారెంట్లోనే కార్పొరేటర్లు ఉండటంతో కొంత ఉత్కంఠ నెలకొంది.
