- విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: వేములవాడ పట్టణ ప్రజలు అభివృద్ధి, సంక్షేమానికే పట్టం కట్టారని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పుల్కం రాజు, వైస్ చైర్‌పర్సన్‌గా నరాల శేఖర్ ఎన్నికైన సందర్భంగా భీమేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ గతంలో మున్సిపల్‌లో ఒకే ఒక్క మెంబర్ ఉండగా.. ప్రస్తుతం పీఠం కైవసం చేసుకుందన్నారు. తాము రెండేండ్లలో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడిగామన్నారు.
గత ప్రభుత్వ హయాంలో పదేండ్లు వేములవాడ అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. ఈ గెలుపుతో మాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రుల సహకారంతో ముందుకు వెళ్తున్నామన్నారు. చైర్‌పర్సన్ పుల్కం రాజు మాట్లాడుతూ వేములవాడ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకారంతో పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకుందామన్నారు.
