- అణు ప్రోగ్రామ్ పై దిగివచ్చిన ఇరాన్
- ఆంక్షలను ఎత్తివేయాలని కండిషన్
- సైనిక బెదిరింపులకు పాల్పడబోమని హామీ ఇవ్వాలని డిమాండ్
టెహ్రాన్: అమెరికాతో న్యూక్లియర్ ప్రోగ్రాంపై రాజీకి వచ్చేందుకు రెడీగా ఉన్నామని ఇరాన్ తెలిపింది. అయితే, తమపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలని, అంతేకాకుండా సైనిక బెదిరింపులకు పాల్పడబోమని హామీ ఇవ్వాలని కండిషన్ పెట్టింది. ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ మాజిద్ తఖ్త్ రవాంచీ.. బీబీసీతో మాట్లాడారు. న్యూక్లియర్ డీల్‌కు తాము రెడీగా ఉన్నామని, ఇప్పుడు బంతి అమెరికా కోర్టులో ఉందని ఆయన చెప్పారు.
అమెరికా కూడా సిన్సియర్ గా ఉంటే, అణు ఒప్పందానికి దారి ఏర్పడుతుందన్నారు. ఈ విషయమై మంగళవారం జెనీవాలో రెండో దశ చర్చలు జరుగుతాయని తెలిపారు. ఈనెల ప్రారంభంలోనూ చర్చలు జరిగాయని, చర్చలు దాదాపు కొలిక్కి వచ్చాయని పేర్కొన్నారు. కాగా.. అణు ఒప్పందంపై ఇరాన్ దీర్ఘకాలంగా జాప్యం చేస్తోందని అమెరికా వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాజిద్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
ఈనెల 14న తమ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీల్‌కు సముఖంగా ఉన్నట్లు ప్రకటించారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వెల్లడించారు. అలాగే, డీల్ కుదరకపోతే ఇరాన్‌పై దాడులు చేసే అవకాశం కూడా ఉందని ట్రంప్ ఇంతకుముందు హెచ్చరించారు.
ఇరాన్ ప్రజలకు మద్దతుగా ఉండండి: యువరాజు
ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం దాదాపు 2.5 లక్షల మంది జర్మనీలోని మ్యునిచ్‌లో ర్యాలీ తీశారని అజ్ఞాతంలో ఉన్న ఇరాన్ రాజకుమారుడు రెజా పహ్లావి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రజలకు మద్దతుగా నిలబడాలని ప్రపంచ దేశాలకు ‘ఎక్స్’లో ఆయన విజ్ఞప్తి చేశారు. త్వరలో అమెరికా, కెనడాలోనూ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేపట్టాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇరాన్లో కావాల్సింది మార్పు ఒక్కటే అని చెప్పారు.
