ఎన్నో ఆశలు, ఆశయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం.. 2025 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికి 2026 కు గ్రాండ్ వెల్కమ్ చెప్పాం.. దేశవ్యాప్తంగా ఘనంగా న్యూఇయర్ వేడుకలను జరుపుకున్నారు ప్రజలు. కొత్త ఏడాది వేడుకల్లో ఎంజాయ్ చేశారు. ఇదంతా బాగానే ఉంది గానీ సంబరాల్లో ఉన్న సామాన్యులకు కొత్త సంవత్సరం మొదట్లోనే కష్టకాలంగా మొదలైంది.. నిత్యాసవరాల ధరల పెరుగుదల వారికి షాకిచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో కూరగాయలు, పండ్లు, మాసం, చికెన్, కోడిగుడ్లధరలు సాధారణ ధరలకంటే రెట్టింపు అయ్యాయి. పండుగల సీజన్ తో సామాన్యులపై అదనపు ఒత్తిడిని పెంచుతోంది. కూరగాయలు, పండ్లు ,ప్రోటీన్ అవసరాల కోసం బడ్జెట్‌ను రూపొందించడం గతంలో కంటే మరింత సవాలుగా మారింది.
ప్రస్తుత ప్రతికూల వాతావరణం కూరగాయల తోటలకు ప్రతికూలంగా మారింది. ఈసారి చలి విపరీతంగా పెరగడంతో దిగుబడి తగ్గింది. డిమాండ్ కు సరిపడా లేక రాష్ట్రంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా కూరగాయలు అధికంగా పండే ఈ సీజన్ లో రూ.50 నుంచి రూ.60కు కిలో దొరికేవి. దిగుబడి తగ్గిపోవడంతో ప్రస్తుతం మార్కెట్లో ఏ కూరగాయలైనా కిలో రూ.80 పైబడి సెంచరీ ధర పలుకుతున్నాయి. ఆకు కూరలకు కూడా రూ.60 నుంచి రూ.80 వెచ్చించాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.సాధారణంగా ఈ సీజన్లో అన్ని కూరల్లో వాడే టమాట కిలో రూ.20 నుంచి రూ.30 మించేది కాదు. బీర, బెండ, కాకర, చిక్కుడు కూరగాయలు అన్నీ ఇప్పుడు రూ.80 నుండి రూ.100కు పైగా అమ్మతున్నారు. ఒక్కో సోరకాయ ధర రూ.40, పచ్చిమిర్చి రూ.100 కు కిలో అమ్ముతున్నారు.
Also Read : మోతమోగుతున్న వందే భారత్ స్లీపర్ ఛార్జీలు
ఇక బెంగళూరులో నూతన సంవత్సరం, రాబోయే సంక్రాంతి పండుగ సందర్భంగా నిత్యావసర కూరగాయలు, పండ్లు, గుడ్లు, మాంసం ధరలు విపరీతంగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్ని మార్కెట్లలో టమోటాలు, ఉల్లిపాయల ధరలు రెట్టింపు అయ్యాయి. క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయల ధరలు బాగా పెరిగాయి. పండుగ డిమాండ్ పెరగడంతో మాంసం, గుడ్లు ధరలు కూడా బాగా పెరిగాయి.
చలి, వేడిగాలులు, సరఫరా తక్కువగా ఉండటం వల్ల టమోటాలు, ఉల్లిపాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ ధరలు భారీగా పెరిగాయి. స్థానిక మార్కెట్లలో టమోటా ధరలు కిలోకు రూ.72కి పెరిగాయి.ఉల్లిపాయలు ఇప్పుడు కిలోకు రూ.42కి అమ్ముడవుతున్నాయి. మునగకాయలు కిలోకు రూ.400 ధర చెల్లించాల్సి వస్తోంది.
కాకరకాయ, క్యారెట్లు, ముల్లంగి, బీన్స్ వంటి ఇతర కూరగాయలు ధరలు కూడా బాగా పెరిగాయి.క్యారెట్ ధర ఇప్పుడు కిలోకు రూ.64 ఉండగా.. ఫ్రెంచ్ బీన్స్ ధర కిలోకు రూ.135 పలుకుతోంది. పండుగ రద్దీ కారణంగా గుడ్లు ,చికెన్ కూడా మరింత ఖరీదయ్యాయి. గుడ్ల రిటైల్ ధరలు ఒక్కొక్కటి రూ.8 ఉండగా, చికెన్ ఇప్పుడు కిలోకు రూ.280నుంచి -300కి అమ్ముడవుతోంది.
శీతాకాలం పండ్ల సరఫరా మరింత తగ్గింది. యాలకుల అరటిపండ్ల ధర ఇప్పుడు కిలోకు రూ.90నుంచి -100 పలుకుతోంది. సంక్రాంతి సమీపిస్తున్న కొద్దీ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. దిగుబడి తగ్గడం, తమిళనాడు ,ఆంధ్రప్రదేశ్ నుంచి సరఫరాలపై ఆధారపడటంతో ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు.
పండుగల సీజన్ తో సామాన్యులపై అదనపు ఒత్తిడిని పెంచుతోంది. కూరగాయలు, పండ్లు ,ప్రోటీన్ అవసరాల కోసం బడ్జెట్‌ను రూపొందించడం గతంలో కంటే మరింత సవాలుగా మారింది.
