ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలి నలుగురు డీఆర్జీ జవాన్లు మృతి

ఛత్తీస్గఢ్లో మందుపాతర పేలి నలుగురు డీఆర్జీ జవాన్లు మృతి
  • మందుపాతరను నిర్వీర్యం చేస్తుండగా ఘటన

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని కాంకేర్​ జిల్లా చోటీభేటియా పోలీస్​స్టేషన్​ పరిధి కోరోస్​కోడా అడవుల్లో శనివారం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు డీఆర్జీ జవాన్లు దుర్మరణం పాలయ్యారు. 

బస్తర్​ ఐజీ సుందర్​రాజ్​పి కథనం ప్రకారం.. నక్సల్స్  లొంగుబాటు అనంతరం వారిచ్చిన పక్కా సమాచారంతో అడవుల్లో డంప్లను వెలికి తీస్తున్నారు. చోటీభేటియా పోలీస్​స్టేషన్​ పరిధిలోని అడవుల్లో డంపుతో పాటు మందుపాతరలు ఉన్నట్లుగా సమాచారం రావడంతో కాంకేర్​ జిల్లాకు చెందిన డీఆర్జీ(డిస్ట్రిక్ట్  రిజర్వ్​డ్​ గార్డు) టీమ్​ను రంగంలోకి దించారు.

వీరు కోరోస్​కోడా అడవుల్లో డంపును వెలికి తీసి, మందుపాతరలను నిర్వీర్యం చేస్తున్న క్రమంలో అకస్మాత్తుగా పేలిపోయింది. భారీ శబ్ధంతో పేలడంతో ఎస్సై సుఖ్​రాం వట్టి, కానిస్టేబుళ్లు కృష్ణా కోమరా, సంజయ్​గాడ్​పాలేలు అక్కడికక్కడే చనిపోయారు. 

తీవ్రంగా గాయపడిన జవాన్​ పరమానంద్​ కోమరాను అత్యవసర చికిత్స కోసం రాయ్​పూర్​కు హెలీకాప్టర్​లో తరలిస్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. ఇప్పటి వరకు లొంగిపోయిన నక్సల్స్  ఇచ్చిన సమాచారం మేరకు అడవుల్లో వారు అమర్చిన 300కు పైగా మందుపాతరలను నిర్వీర్యం చేశామని, కానీ, తాజా ఘటనలో అవి పేలి నలుగురు జవాన్లు చనిపోవడం బాధాకరమని ఐజీ తెలిపారు.