- ప్రమాదం.. నలుగురు మృతి
- శ్రీరాంపూర్ ఎస్సార్పీ 3 బొగ్గు గనిలో ఘోరం
- ప్రమాదకరంగా మారిన పై కప్పు
- సరిచేయబోతుండగా కుప్పకూలింది
- స్పాట్లోనే చనిపోయిన కార్మికులు
- కార్మిక సంఘాల ఆందోళన, ఉద్రిక్తత
నస్పూర్ / మందమర్రి: సింగరేణిలో ఘోరం జరిగింది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ఏరియాలోని ఎస్సార్పీ 3 బొగ్గు గనిలో పై కప్పు కూలి నలుగురు కార్మికులు చనిపోయారు. గనిలో సీమ్ జంక్షన్ నుంచి 15 మీటర్ల దూరంలోని వర్క్ ప్లేస్ దగ్గర భారీ పై కప్పు (బొగ్గు బండ) బుధవారం ఒక్కసారిగా కూలింది. దాంతో టింబర్ మెన్ బేర లచ్చయ్య(61), వి.కృష్ణారెడ్డి(58), బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహరాజు(32), రెంక చంద్రశేఖర్(32) అక్కడికక్కడే మరణించారు. పై కప్పు వారం రోజుల నుంచే ప్రమాదకరంగా మారిందని చెబుతున్నారు. దాన్ని సరి చేసేందుకు ఉదయం షిఫ్టులో నలుగురు కార్మికులు లోపలికి వెళ్లారు. పై కప్పు కూలకుండా రోప్, దాట్లు, ఐరన్ మెష్ బిగించే పనులు చేపట్టారు. వారు డ్యూటీకెక్కిన మూడు గంటల్లోనే ప్రమాదం జరిగింది.
బొగ్గు బండ కింద కూరుకుపోయిన చంద్రశేఖర్ మృతదేహాన్ని సింగరేణి రెస్క్యూ బృందం సాయంత్రం ఐదింటి ప్రాంతంలో గని బయటకు తీసుకొచ్చింది. శవాన్ని పోలీసులు నేరుగా ఆస్పత్రికి తరలించబోగా కార్మికులు, కార్మిక సంఘాలు అడ్డుకోవడం తీవ్ర తోపులాటకు దారితీసింది. చివరకు తరలింపు ప్రయత్నాన్ని పోలీసులు విరమించుకున్నారు. ఒక్కో కార్మికుని కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. గనిలో సేఫ్టీ చర్యల విషయంలో నిర్లక్ష్యం చూపిన ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలంటూ కార్మిక సంఘాలు ఆందోళనకు దిగాయి. ఉద్రిక్తత నేపథ్యంలో భారీ బందోబస్తు చేపట్టారు. మంచిర్యాల ఏసీపీ అఖిల్‌మహాజన్, జైపూర్ఏసీపీ నరేందర్, సీఐలు రాజు, సంజీవ్, ప్రవీణ్ కుమార్, ఎస్సైలు, పోలీసులు భారీగా మోహరించారు. శ్రీరాంపూర్ఏరియా సింగరేణి జీఎం ఎం.సురేశ్, ఏరియా ఆఫీసర్లు, ఏఐటీయూసీ, టీబీజీకేఎస్ఐఎన్టీయూసీ, సీఐటీయూ వంటి కార్మిక సంఘాల నేతలు, బీజేపీ నేతలు ఘటనా స్థలానికి వచ్చారు. మరోవైపు బుధవారం తెల్లవారుజామున శ్రీరాంపూర్ ఏరియా ఆర్ కే 5బీ గనిలో జరిగిన ప్రమాదంలో రాజేశం అనే కార్మికుడు గాయపడ్డాడు.
రిటైరై.. రీ జాయినై.. మృత్యు ఒడిలోకి లక్ష్మయ్య
ప్రమాదంలో దుర్మరణం పాలైన బదిలీ వర్కర్ బేర లచ్చయ్య ఈ ఏడాది జులైలోనే రిటైరయ్యాడు. రిటైర్మెంట్ ఏజ్ ను 61 ఏళ్లకు పెంచడంతో ఆగస్టు నుంచి మళ్లీ డ్యూటీకి వస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు సంతానం. కుటుంబం నస్పూర్‌లోని షిర్కే కాలనీలో ఉంటోంది. మరో మృతుడు చంద్రశేఖర్‌కు భార్య, ఆర్నెల్ల కొడుకు ఉన్నారు. కృష్ణారెడ్డి రిటైర్మెంట్ కోసం ఇటీవలే మెడికల్‌బోర్డుకు హాజరయ్యాడు. తిరిగి డ్యూటీ చేయాలని యాజమాన్యం ఆదేశించడంతో వారం రోజుల నుంచే డ్యూటీకి వస్తున్నాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు. సత్యనర్సింహరాజుకు ఇంకా పెండ్లి కాలేదు.
మృతదేహాల కోసం గంటల నిరీక్షణ
కార్మికుల మృతదేహాలను గని నుంచి బయటికి తేవడంలో తీవ్ర జాప్యం జరిగింది. చంద్రశేఖర్ మృతదేహాన్ని సాయంత్రం తీసుకురాగా మిగతా మూడింటి కోసం కుటుంబాలు, కార్మికులు, లీడర్లు గంటల తరబడి నిరీక్షించారు. బండరాయి కింది నుంచి వెలికితీసి కూడా, బయటికి తీసుకొస్తే ఆందోళన పెరగొచ్చని గని లోపలే 6 లెవల్ వద్ద ఉంచారని కార్మిక సంఘాల లీడర్లు ఆరోపించారు. రాత్రి 9.40 గంటలప్పుడు లచ్చయ్య, కృష్ణారెడ్డి, సత్యనర్సింహరాజు మృతదేహాలను బయటకు తెచ్చారు. పోలీసుల బందోబస్తు మధ్య మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు గని వద్ద ఆందోళన రాత్రి దాకా కొనసాగింది.
భద్రతా చర్యల్లేకే ప్రమాదం: బండి సంజయ్
సింగరేణి ప్రమాదంలో నలుగురు కార్మికులు మరణించడం పట్ల బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆ కుటుంబాలను తక్షణం ఆదుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. కార్మికుల భద్రతకు యాజమాన్యం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీకి లేఖ రాస్తామని చెప్పారు.
ప్రమాదం బాధాకరం: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
సింగరేణి ప్రమాదంలో నలుగురు కార్మికుల మృతి దిగ్భ్రాంతికరమని ఎమ్మెల్సీ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ప్రభుత్వం తరపున వారికి అన్ని రకాలుగా అండగా నిలుస్తామని చెప్పారు.
ఇంటికొకరికి ఉద్యోగం : సీఎండీ శ్రీధర్
ప్రమాదంపై సింగరేణి యాజమాన్యం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించింది. సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు యాజమాన్యం అండగా ఉంటుందని చెప్పారు. ‘‘ప్రమాదం అత్యంత దురదృష్టకరం. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలి” అని అధికారులను ఆదేశించారు. ప్రతి బాధిత కుటుంబంలో అర్హులైన ఒకరికి కోరుకున్న ఏరియాలో ఉద్యోగమిస్తామని చెప్పారు. మృతుల కుటుంబాలకు కంపెనీ ద్వారా చెల్లించే సొమ్ము తక్షణమే అందజేయాలని ఆదేశించారు. మ్యాచింగ్ గ్రాంట్, గ్రాట్యూటీ తదితరాలు కలిపి రూ. 70 లక్షల నుంచి కోటి దాకా
చెల్లిస్తామన్నారు.
