
- ఛత్రినాకలో రెండంతస్తుల భవనం.. నార్సింగిలో లేబర్ క్యాంప్.. షాద్‌నగర్‌లో కారు గ్యారేజ్.. ఎంజీబీఎస్ సమీపంలో మంటలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: గుల్జార్ హౌస్ ఘటన మరవకముందే సిటీలో మరో మూడుచోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఛత్రినాకలో మంగళవారం ఓ రెండంతస్తుల భవనంలో మధ్యాహ్నం అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. లోపల ఉన్నవారు అప్రమత్తమై బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న చాంద్రాయణగుట్ట ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని, మంటలను ఆర్పివేశారు. ఈ భవనంలో చెప్పుల గోదాం నిర్వహిస్తుండగా, భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు పేర్కొన్నారు.
గండిపేట్ : నార్సింగి పరిధిలోని లేబర్ క్యాంప్‌లో మంగళవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో నాలుగు రేకుల షెడ్లు దగ్ధమయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి, మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో దుస్తులు, నిత్యావసర వస్తువులు, డబ్బులు దగ్ధమయ్యాయని కార్మికులు విలపించారు.
షాద్ నగర్ : షాద్ నగర్ పట్టణంలోని నేషనల్హైవే పక్కనున్న ధన గ్యారేజ్ లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి, 6 కార్లు దగ్ధమయ్యాయి. మంగళవారం తెల్లవారుజామున గ్యారేజ్ లోని ఓ ఇండికా కారు బ్యాటరీ పేలింది. పక్కనే ఉన్న వాహనాలకు మంటలు అంటుకోవడంతో 6 వాహనాలు కాలిపోయాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వాళ్లు అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు నష్టం జరిగి ఉండవచ్చని అంచనా.
బషీర్‌బాగ్: ఎంజీబీఎస్ సమీపంలోని ఓ చెత్త కుప్పలో మంగళవారం రాత్రి భారీగా మంటలు ఎగసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో గౌలిగూడ ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.